హైదరాబాద్: క్యాన్సర్ ఉందంటూ బిల్డర్కు బురిడీ..రూ.6.5 కోట్లు వసూలు చేసిన భార్యాభర్తలు

హైదరాబాద్: క్యాన్సర్ ఉందంటూ బిల్డర్కు బురిడీ..రూ.6.5 కోట్లు వసూలు చేసిన భార్యాభర్తలు
  •      బంగారం, ఆస్తులు, కారు కొనుగోలు

హైదరాబాద్​సిటీ, వెలుగు : తాను క్యాన్సర్​తో బాధపడుతున్నానంటూ అబద్దం చెప్పి  చికిత్స కోసం డబ్బులు కావాలని ఓ బిల్డర్​నుంచి రూ.6.5 కోట్లు వసూలు చేసిందో మహిళ.. ఇందులో ఆమె భర్త సుజిత్​కూడా సహకరించడంతో ఇద్దరిపై మధురానగర్​పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది

ఎల్లారెడ్డిగూడకు చెందిన మల్లికార్జున్ రెడ్డి బిల్డర్. వసంత నగర్ కు చెందిన వాసిరెడ్డి స్వాతి, మల్లికార్జున్​రెడ్డి పరిచయస్తులు. తనకు ప్రాణాంతకమైన క్యాన్సర్​సోకిందని మల్లికార్జున్​ను నమ్మించిన స్వాతి చికిత్స కోసం డబ్బు కావాలని అడిగింది. 

మల్లికార్జున్​కుటుంబం నుంచి విడతల వారీగా రూ.6.5 కోట్లు తీసుకుంది. నయమైన తర్వాత తమ వద్ద ఉన్న బంగారం లేదా భూమి ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆ డబ్బులతో ఆస్తులు,  బంగారం, కారు కొన్నట్టు మల్లికార్జున్​రెడ్డికి తెలిసింది. 

దీంతో ఇటీవల తన డబ్బులు తనకు కావాలని అడగ్గా ఆత్మహత్య నోట్ రాసి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని స్వాతితో పాటు ఆమె భర్త బెదిరించాడు. దీంతో పోలీసులను ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.