- గంజాయి, దగ్గు మందులు, అక్రమ మద్యం బాటిల్స్ పట్టివేత
- 15 మంది అదుపులోకి..
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం తెల్లవారుజామున భారీ సంఖ్యలో సిబ్బందితో హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగార్ బస్తీలో ‘థండర్‌బోల్ట్’ పేరుతో భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ బస్తీలో హత్యలు, దొంగతనాలు, చైన్ స్నాచింగ్స్ కేసుల్లో శిక్ష అనుభవించి వచ్చిన 250 మందికి పైగా పాత నేరస్తులు ఉంటున్నట్టు సమాచారం. వారిలో కొందరు యువతను మత్తుకు బానిసలుగా మార్చేందుకు గంజాయి, నిషేధిత నైట్రావెట్ ట్యాబ్లెట్స్, అక్రమ మద్యం, దగ్గు సిరప్‌లు విక్రయిస్తున్నట్లు పోలీసులకు టిప్ అందింది. దీంతో ఈ ముఠాలను పట్టుకోవడమే లక్ష్యంగా ఆపరేషన్నిర్వహించారు.
ఇరుకైన గల్లీలతో, ఒకదానికొకటి కలిసినట్టు ఉండే ఇండ్లతో కూడిన స్లమ్ ఏరియా కావడంతో ఒకరిద్దరు పోలీసులు వెళ్తే సులభంగా తప్పించుకునే అవకాశం ఉండడం, పోలీసులపై తిరగబడే ఛాన్స్ఉండడంతో వివిధ విభాగాలకు చెందిన 1,100 మంది పోలీసులతో ఈ ఆపరేషన్నిర్వహించారు. అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, అడిషనల్ సీపీ ఎస్.ఎం.శ్రీనివాస్ ఈ తనిఖీల్లో పాల్గొనగా..టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఫీల్డ్లెవెల్లో ముందుండి నడిపించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్, టాస్క్ ఫోర్స్, హెచ్-ఫాస్ట్ బృందాలు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఎక్స్పర్ట్స్, సీఏఆర్ సాయుధ బలగాలతో పాటు సివిల్ పోలీసులు ఆపరేషన్‌లో పాలుపంచుకున్నారు. బస్తీలోకి ఎవరూ రాకుండా, లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా గట్టి బందోబస్తు నడుమ ప్రతి ఇల్లూ తనిఖీ చేశారు.
ఏం దొరికాయంటే..
ఆకస్మిక సోదాల్లో పెద్ద ఎత్తున నిషేధిత మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 150 గంజాయి ప్యాకెట్లు, కిలో ఎండు గంజాయి, మత్తు కోసం ఉపయోగించే 32 దగ్గు (కాఫ్) సిరప్ సీసాలు, అక్రమ మద్యం బాటిల్స్పట్టుకున్నారు. డ్రగ్స్, గంజాయి విక్రయిస్తున్న 15 మందిని పట్టుకున్నారు. వీరితో పాటు ఇతరుల డబ్బు, నగలు, భూమి, విలువైన వస్తువులను దోచుకునే ప్రాపర్టీ అఫెండర్స్, చైన్‌స్నాచర్లు, కోర్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్న 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని పలు అనుమానాస్పద వాహనాలను కూడా సీజ్ చేశారు.
