- విభేదాలు పక్కనపెట్టి కలిసి పనిచేయండి
- ఈసారి తెలంగాణలో గెలుపు బీజేపీదే
- రాష్ట్ర పార్టీ నేతలకు కేంద్రమంత్రి దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పార్టీ తలుపులు బార్లా తీయండి..అందరినీ చేర్చుకోండి. అప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుంది’ అని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారని నడ్డా అభిప్రాయపడ్డారు. ‘నేను హిమాచల్ ప్రదేశ్‌లో కూడా అనేకమంది కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేరేలా చేస్తున్నాను.
ఇక్కడ కూడా అదే వ్యూహంతో ముందుకు వెళ్లాలి. వేరే పార్టీల వాళ్లు చేరినప్పుడే పార్టీకి మరింత బలం పెరుగుతుంది. నాయకులు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం ఉంది, వారిని సాదరంగా ఆహ్వానించండి’ అని చెప్పినట్టు సమాచారం. పార్టీలో అంతర్గత విభేదాలు పక్కనపెట్టి అందరూ ఐక్యంగా పనిచేయాలని నడ్డా హితబోధ చేశారు.
మోదీ, అమిత్ షా అంటే దేశవ్యాప్తంగా అభిమానం ఉందని. కానీ, నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్ని అభిమానించేలా చూసుకోవాలని సూచించారు. కార్యకర్తలతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలని వారితో సంబంధాలు దెబ్బతింటే మీరు డిస్కనెక్ట్ అయిపోతారని హెచ్చరించారు. తమ సొంత ఆసక్తితోనే ఈ సమావేశం ఏర్పాటు చేయాలని కోరినట్లు నడ్డా వెల్లడించారు.
తాను చిన్న స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగాననీ, పార్టీ కష్టనష్టాలు తనకు తెలుసన్నారు. ‘మీరంతా కష్టపడి పనిచేయండి.. మీ వెనుక మేముంటాం..ఈసారి తెలంగాణలో అధికారం మనదే..’ అని భరోసా ఇచ్చారు.
