హైదరాబాద్ లో మరో భారీ గోల్డ్ లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోనే కోట్ల రూపాయల మేర బంగారు రుణాల వ్యవహారంలో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఈ బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక రెడ్డి కస్టమర్లను నమ్మించి, నట్టేట ముంచిందంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. తక్కువ వడ్డీకే బంగారు రుణాలు ఇప్పిస్తామంటూ ఆమె ఆడిన మాయమాటలను నమ్మి దాదాపు 40 మంది కస్టమర్లు తమ బంగారాన్ని ఇక్కడ తాకట్టు పెట్టారు.
అయితే, ఇక్కడే మేనేజర్ ప్రియాంక రెడ్డి అసలు స్కెచ్ వేసింది. కస్టమర్ల నుంచి వడ్డీ డబ్బులను సంస్థ అధికారిక ఖాతాలో కాకుండా.. తెలివిగా తన వ్యక్తిగత ఖాతాలో జమ చేయించుకుంది. అంతటితో ఆగకుండా, దాదాపు 40 మంది కస్టమర్లకు చెందిన కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని.. ముత్తూట్ సంస్థకు తెలియకుండా మరో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు బదిలీ చేసినట్లు బాధితులు ఘోరమైన ఆరోపణలు చేస్తున్నారు.
తాము కట్టిన వడ్డీలకు రశీదులు అడుగుతున్నా, తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరుతున్నా మేనేజర్ నుంచి సరైన స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
మోసపోయామని గ్రహించిన బాధితులంతా కలిసి న్యాయం చేయాలంటూ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశారు. మేనేజర్ ప్రియాంక రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమ జీవితకాల కష్టమైన బంగారాన్ని తమకు దక్కేలా చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.
బాధితుల ఫిర్యాదులను స్వీకరించిన కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్‌లో కేవలం మేనేజర్ ఒక్కరే ఉన్నారా? లేక దీని వెనుక ఇంకా పెద్ద ముఠా ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి విచారణ జరిపితే కానీ ఈ భారీ మోసానికి సంబంధించిన మరిన్ని నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చేలా లేవు.
