యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం నూతన పాలకవర్గం శనివారం(జూలై11) ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 11:37 గంటలకు ప్రధానాలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనం, నిత్య కైంకర్యాల సమయాల్లో అధికారులు తాత్కాలిక మార్పులు చేశారు.
శనివారంఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తుల దర్శనాలను నిలిపివేస్తారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొండపైకి ప్రైవేటు, ఇతర వాహనాలకు అనుమతి ఉండదు.
సుదర్శన నరసింహ హోమాన్ని ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తారు. బ్రేక్ దర్శనం ఉదయం 9 గంటల నుంచి 9:30 గంటల వరకు ఉంటుంది. నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
