TCSలో మారిన సీన్.. 20 వేల ఉద్యోగుల లేఆఫ్ తర్వాత 9వేల మంది రిక్రూట్మెంట్

TCSలో మారిన సీన్.. 20 వేల ఉద్యోగుల లేఆఫ్ తర్వాత 9వేల మంది రిక్రూట్మెంట్

ఒకప్పుడు ఐటీ రంగంలో భారీ నియామకాలతో దూసుకెళ్లిన TCS.. 2025లో ఉద్యోగుల సంఖ్య తగ్గడంతో పెద్ద చర్చకు కారణమైంది. ఏఐ ఎఫెక్ట్, అంతర్జాతీయ మార్కెట్లలో మందగమనం, ఖర్చుల నియంత్రణ కారణంగా ఉద్యోగాల కోతలు తప్పవా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏడాది తిరగకముందే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అదే టీసీఎస్ మళ్లీ రిక్రూట్మెంట్స్ బాట పట్టింది.

3 ఏళ్లలోనే అతిపెద్ద హైరింగ్ జంప్..
2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో టీసీఎస్ ఏకంగా 9వేల 279 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకుంది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5లక్షల 93వేల 798కు చేరుకుంది. గత 3 సంవత్సరాల్లో ఒక త్రైమాసికంలో నమోదైన అతిపెద్ద ఉద్యోగుల పెరుగుదల ఇదే. దీంతో ఐటీ రంగంలో ఉద్యోగాల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు కొంత ఊరట లభించింది.

20 వేల ఉద్యోగాల కోతకు కారణం ఏంటి?
2025 సెప్టెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 19వేల 755 తగ్గింది. ఆ తర్వాత డిసెంబర్ త్రైమాసికంలో మరో 11వేల151 మంది తగ్గడంతో పెద్ద ఎత్తున లేఆఫ్స్ జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. అయితే కంపెనీ మాత్రం ఇది ముందుగా నిర్ణయించిన ఉద్యోగాల తొలగింపు కాదని స్పష్టం చేసింది. పనితీరు, వ్యాపార అవసరాలు, ప్రాజెక్టుల్లో మార్పులు, రీస్కిల్లింగ్ తర్వాత తొలగింపులు జరిగాయని టీసీఎస్ తెలిపింది.

మళ్లీ ఎందుకు నియామకాలు మొదలయ్యాయి?
టీసీఎస్ వ్యాపారం బలంగా కొనసాగడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం 5 శాతం పెరిగి రూ.13వేల 349 కోట్లకు చేరుకుంది. ఆదాయం 14 శాతం వృద్ధితో రూ.72వేల 275 కోట్లకు పెరిగింది. అలాగే కంపెనీ ఆర్డర్ బుక్ విలువ 9.5 బిలియన్ డాలర్లుగా ఉంది. భారీ డీల్స్, డిజిటల్ సేవలకు పెరుగుతున్న డిమాండ్, ఏఐ ఆధారిత ప్రాజెక్టులు కంపెనీకి కొత్త అవకాశాలను తెస్తున్నాయి.

AIతో ఉద్యోగాలు పోతున్నాయా? 
ఏఐ కారణంగా ఐటీ జాబ్స్ తగ్గిపోతాయని చాలామంది భావించారు. కానీ టీసీఎస్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. కంపెనీ ఇప్పుడు సాధారణ నియామకాల కంటే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులపై ఎక్కువ ఫోకస్ పెట్టి వారిని వెతికి రిక్రూట్ చేసుకుంటోంది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజినీరింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న వారికి డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో పాత ఉద్యోగులకు కొత్త టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చి రీస్కిల్లింగ్ చేయడంపై కంపెనీ ఫోకస్ చేస్తోంది.

ALSO READ : బెంగళూరులో టీచర్ జీతం రూ.6 వేలా?

మాస్ హైరింగ్ కాదు.. స్మార్ట్ హైరింగ్
టీసీఎస్ మళ్లీ భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ.. ఇది కరోనా తర్వాత కనిపించిన భారీ నియామకాల తరహాలో ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ అవసరాలకు తగ్గట్టుగా సరైన నైపుణ్యాలు ఉన్న వారినే ఎంపిక చేసే విధానం కొనసాగనుంది. ఒకప్పుడు లేఆఫ్స్ చర్చకు కారణమైన టీసీఎస్.. ఇప్పుడు "కొత్త అవకాశాల సృష్టి" వైపు అడుగులు వేస్తోంది. ఐటీ రంగంలో భవిష్యత్ ఉద్యోగాలు సంఖ్య కంటే నైపుణ్యాలపై ఆధారపడతాయని ఇది స్పష్టం చేస్తోంది.