ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న అమెరికాకు చెందిన మాథ్యూ ఆరోన్ వాన్‌డైక్ అనే ఖైదీ.. జైలు తిండి పడక, తనకు అమెరికన్ స్టైల్ ఫుడ్ కావాలని కోర్టును ఆశ్రయించాడు. భారతదేశానికి వ్యతిరేకంగా మయన్మార్ ఉగ్రవాద ముఠాలకు డ్రోన్ శిక్షణ ఇచ్చాడనే ఆరోపణలపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇతడిని అరెస్ట్ చేసింది.
తీహార్ జైల్లో ఇచ్చే భారతీయ ఆహారం చాలా కారంగా, నూనెతో, బాగా వేయించి ఉంటోందని, దాన్ని తాను అస్సలు తినలేకపోతున్నానని 45 ఏళ్ల వాన్‌డైక్ కోర్టుకు తెలిపాడు. జైలు తిండి పడక అతను గత 50 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. కేవలం జ్యూస్‌లు, సోయా పాలు తాగుతూ బతుకుతున్నాడు.దీనివల్ల అతను బాగా వీక్ అయిపోయాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు, కంటిచూపు కూడా మందగించింది. గత విచారణకు అతన్ని వీల్‌చైర్‌లోనే కోర్టుకు తీసుకువచ్చారు.
కోర్టులో ఏం అడిగాడంటే
తనకు పాస్తా, చికెన్, చేపలు, ఆలివ్ ఆయిల్ వంటి అమెరికన్ తరహా ఆహారాన్ని అనుమతించాలని కోరాడు. అవసరమైతే జైలు లోపలే చిన్న వంట సామాగ్రితో భోజనాన్ని తనే వండుకుంటానని, దీనికి అయ్యే ఖర్చంతా తన కుటుంబమే భరిస్తుందని చెప్పాడు. మానవతా దృక్పథంతో ఈ అనుమతి ఇవ్వాలని అతని తరపు లాయర్లు కోరారు. దీనిపై కోర్టు జూలై 21న విచారణ జరపనుంది.
అసలు ఇతనిపై ఉన్న కేసు ఏంటంటే
2026 మార్చి 13న ఢిల్లీ విమానాశ్రయంలో వాన్‌డైక్‌ను NIA అధికారులు అరెస్ట్ చేశారు. ఇతనితో పాటు మరో ఆరుగురు ఉక్రెయిన్ జాతీయులను కూడా పట్టుకున్నారు.
వీరంతా టూరిస్ట్ వీసాలపై ఇండియాకు వచ్చి, ఎలాంటి పర్మిషన్లు లేకుండా మిజోరాం బోర్డర్ దాటి మయన్మార్‌లోకి ప్రవేశించారు. అక్కడ స్థానిక సాయుధ ముఠాలకు డ్రోన్లు నడపడం, డ్రోన్ బాంబులు తయారు చేయడం, సిగ్నల్స్ జామ్ చేసే టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. ఇది భారత జాతీయ భద్రతకు ముప్పు కలిగించే పెద్ద కుట్ర అని NIA కేసు నమోదు చేసింది.
ఎవరు ఈ మాథ్యూ వాన్‌డైక్?
ఇండియాలో అరెస్ట్ అవ్వకముందు వాన్‌డైక్ అంతర్జాతీయంగా ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్. అలాగే ప్రపంచవ్యాప్తంగా గొడవలు జరిగే ప్రాంతాల్లో తిరుగుతూ, అక్కడి స్థానిక దళాలకు సైనిక శిక్షణ ఇచ్చే 'సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్' (SOLI) అనే సంస్థకు వ్యవస్థాపకుడు.
లిబియా విప్లవం: 2011లో లిబియా పాలకుడు గడ్డాఫీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తిరుగుబాటుదారులతో చేరి యుద్ధం చేశాడు. అక్కడ జైలు పాలై, ఆ తర్వాత తప్పించుకున్నాడు. దీనిపై ఒక అవార్డు విన్నింగ్ డాక్యుమెంటరీ కూడా తీశాడు.
ALSO READ : అవినీతి అధికారి మాస్టర్ ప్లాన్ : ఆ ఇంట్లోని గోడల్లో డబ్బు.. సోఫాల్లో డబ్బు..
సైనిక శిక్షణ: ఇరాక్, ఉక్రెయిన్ వంటి దేశాల్లోని స్థానిక దళాలకు ఇతని సంస్థ సైనిక శిక్షణ ఇచ్చింది. ఇతనిది మానవతా సంస్థా లేక ప్రైవేట్ మిలిటరీ సంస్థా అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తాను భక్తిపరుడైన క్రైస్తవుడినని, ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న బలహీనులను రక్షించడమే తన నైతిక బాధ్యతని ఇతను నమ్ముతాడు.
ప్రస్తుత పరిస్థితి:
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉంది. జైలు అధికారులు దీనిపై స్పందించడానికి సమయం కోరడంతో, కోర్టు తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.
