భారత జట్టులో ప్రక్షాళనకు రంగం సిద్ధం.. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత బీసీసీఐ  రివ్యూ!

భారత జట్టులో ప్రక్షాళనకు రంగం సిద్ధం.. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత బీసీసీఐ  రివ్యూ!

BCCI Review: భారత టీ20 క్రికెట్ జట్టు ప్రదర్శన ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. టీ20 వరల్డ్ కప్ విజేతలుగా నిలిచిన టీమిండియా.. విదేశీ పర్యటనల్లో వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతుంది. దీంతో BCCI అత్యంత కీలకమైన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుత ఇంగ్లండ్ టూర్ ముగిసిన వెంటనే పురుషుల టీ20 జట్టు ప్రదర్శనపై అత్యున్నత స్థాయి సమీక్షా ( Review) సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.  

సిరీస్ ఓటమి.. బీసీసీఐ చీఫ్ కీలక వ్యాఖ్యలు: 

ప్రస్తుతం ఎడిన్‌బర్గ్‌లో జరుగుతున్న ఐసీసీ (ICC) వార్షిక సమావేశంలో బీసీసీఐ చీఫ్ దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. భారత టీ20 జట్టు ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కొంటోందన్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో జట్టు ప్రదర్శన అట్టడుగు స్థాయికి పడిపోవడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్ ముగిసిన వెంటనే జట్టు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి వివరణాత్మక సమీక్ష జరుపుతామన్నారు. ఆ మీటింగ్ లో ఖచ్చితంగా అన్ని సమస్యలకు పరిష్కారాలను కనుగొంటామని చెప్పారు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఈ హై-లెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. 

వరుసగా విఫలమవుతున్న భారత్ బ్యాటింగ్:

బ్రిస్టల్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఘోరమైన బ్యాటింగ్ వైఫల్యాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడినప్పటికీ, జట్టులోని మిగిలిన బ్యాటర్లంతా చెత్త షాట్ సెలెక్షన్‌తో వికెట్లు పారేసుకున్నారు. ఫలితంగా భారత్ కేవలం 158 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (79 నాటౌట్), ఫిల్ సాల్ట్ (59 నాటౌట్) తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో మరో 6 ఓవర్లు మిగిలి ఉండగానే టార్గెట్ ని అలవోకగా ఛేదించింది. 

టీమిండియాను వేధిస్తున్న సమస్యలు ఇవే:

ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేసిన భారత్‌కు ఈ టూర్ ఒక పీడకలలా మిగిలిపోయింది. ఐర్లాండ్ చేతిలో చరిత్రలోనే ఫస్ట్ టైమ్ సిరీస్ ఓడిపోవడమే కాకుండా, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 76 రన్స్ కే ఆలౌట్ అయి 125 పరుగుల తేడాతో ఓడిపోవడం జట్టు పతనాన్ని సూచిస్తోంది. ఇండియన్ టీమ్ లో అటు టాప్ ఆర్డర్, ఇటు మిడిల్ ఆర్డర్ పిచ్‌లకు అనుగుణంగా ఆడటంలో పూర్తిగా ఫెయిల్ అవుతున్నారు. వీటికి తోడు హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి మ్యాచ్ విన్నర్లు టీమ్ లో లేకపోవడంతో బౌలింగ్ విభాగం కూడా విఫలమవుతుంది. 

ALSO READ : భారత టీ20 కెప్టెన్సీలో బిగ్ ట్విస్ట్.. 

నంబర్ 1 పట్టు కోసం అగ్నిపరీక్ష: 

ఈ వరుస ఓటములతో సిరీస్ ఓడిపోయిన భారత జట్టు రేపు (శనివారం) సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్ మైదానంలో జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ భారత్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఐసీసీ మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో తమ నంబర్ వన్ స్థానాన్ని కాపాడుకోవాలంటే ఇండియా ఈ చివరి మ్యాచ్‌లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈ లోగా జూలై 23వ తేదీ నుంచి హరారే వేదికగా జింబాబ్వేతో జరగబోయే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభానికి ముందే.. బీసీసీఐ నిర్వహించే రివ్యూ మీటింగ్ యొక్క సంచలన నిర్ణయాలు అమల్లోకి వస్తాయో లేదో చూడాల్సిందే.