రేటు ఎక్కువైనా మంచి పెట్రోలే కొట్టిచ్చుకుంటాం.. ఢిల్లీలో E20కి దండం పెట్టేస్తున్న ఓనర్స్

రేటు ఎక్కువైనా మంచి పెట్రోలే కొట్టిచ్చుకుంటాం.. ఢిల్లీలో E20కి దండం పెట్టేస్తున్న ఓనర్స్

ఢిల్లీలోని పెట్రోల్ బంకుల దగ్గర కొత్త ట్రెండ్ నడుస్తోంది. వెహికల్ ఓనర్స్ సాధారణ పెట్రోల్ కంటే ప్రీమియం పెట్రోల్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా E20 పెట్రోల్‌పై కొనసాగుతున్న చర్చ, ఇంజిన్ పనితీరు, మైలేజ్‌పై ఉన్న అనుమానాలతో రోజురోజుకూ ప్యూర్ పెట్రోల్ కొనేవారి డిమాండ్ దేశ రాజధానిలో పెరిగిపోతోంది. దీంతో ఢిల్లీలో XP95, XP100, Speed 97 వంటి ప్రీమియం పెట్రోల్ రకాలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం.

E20 వద్దు.. ప్యూర్ పెట్రోల్ ముద్దు..
ఢిల్లీలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ప్రీమియం ఫ్యూయల్ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, రిచ్ పీపుల్ ఎక్కువగా ఉండే ఏరియాల్లోని ఔట్‌లెట్లలో ఏకంగా 5 రెట్లు డిమాండ్ పెరిగిందని సమాచారం. ఒక పెట్రోల్ బంక్‌లో XP95 అమ్మకాలు రోజుకు 1,000 లీటర్ల నుంచి 1,500-1,700 లీటర్లకు పెరిగాయి. అదే సమయంలో XP100 డిమాండ్ రోజుకు 100 లీటర్ల నుంచి దాదాపు 500 లీటర్లకు చేరిందట.

E20పై భయమా? లేక నాణ్యమైన ఫ్యూయల్ కోసమా?
వాహనదారుల్లో కొంతమంది E20 పెట్రోల్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 20 శాతం ఇథనాల్ కలిగిన ఈ ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందా? పాత వాహనాల ఇంజిన్‌పై ప్రభావం ఉంటుందా? అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. దీంతో కోరి కష్టాలు తెచ్చుకోవటం దేనికిలే అనుకుంటున్న రిచ్ పీపుల్ అధిక ఆక్టేన్ ఉన్న ప్రీమియం పెట్రోల్‌ పోయించుకుంటున్నారు తమ వాహనాల్లో. అయితే ఆటోమొబైల్ కంపెనీలు, ఆయిల్ సంస్థలు మాత్రం E20 అనుకూల వాహనాలకు ఎలాంటి పెద్ద సమస్యలు ఉండవని చెబుతున్నాయి. E20 వాహనాలపై నిర్వహించిన పరీక్షల్లో ఇంజిన్ పనితీరు, మన్నిక విషయంలో సమస్యలు కనిపించలేదంటున్నారు.

ALSO READ : వేరువేరుగా ఫ్యూర్, E10, E20 పెట్రోల్స్ అమ్మటం కుదరదా..?

ప్యూర్ పెట్రోల్ డిమాండ్ వెనుక అసలు కారణం
చాలా మంది వాహనదారులు తమ ఖరీదైన కార్లు, ప్రీమియం బైకులకు మంచి పనితీరు కావాలనే ఉద్దేశంతో అధిక ఆక్టేన్ పెట్రోల్‌ను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా హై-ఎండ్ వాహనాల యజమానులు ఇంజిన్ ప్రొటెక్షన్, స్మూత్ డ్రైవింగ్ కోసం ఎక్కువ రేటు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. మెుత్తానికి E20 అనేది దేశ ఇంధన విధానంలో కీలక మార్పుగా ప్రభుత్వం భావిస్తుండగా, కొందరు వినియోగదారులు మాత్రం తమ వాహనాల పనితీరు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఢిల్లీలో ప్రీమియం పెట్రోల్ డిమాండ్ పెరగడం కొత్త చర్చకు దారితీసింది. మోడీ సర్కార్ మాత్రం ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇప్పటివరకు రూ.లక్షా 97వేల కోట్ల ఫారెక్స్ సేవ్ చేశామిని అంటోంది.