సినిమాల్లేవ్.. అంతా స్పోర్ట్స్ మయం.. ఫుట్‌బాల్ క్రేజ్‌తో రూటు మార్చిన మల్టీప్లెక్స్‌ ఓనర్స్!

సినిమాల్లేవ్.. అంతా స్పోర్ట్స్ మయం.. ఫుట్‌బాల్ క్రేజ్‌తో రూటు మార్చిన మల్టీప్లెక్స్‌ ఓనర్స్!

సిల్వర్ స్క్రీన్స్ అంటే కేవలం కేవలం హీరోల చిత్రాలతో ప్రేక్షకులను అలరించేవే కాదు. ఇప్పుడు ఆ సినిమా హాల్స్ ట్రెండ్ మారింది. మెస్సి డ్రిబ్లింగ్స్, నెయ్ మార్ మెరుపు గోల్స్ కు కూడా థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇండియాలో ఫుల్ బాల్ క్రేజ్ నెక్ట్స్ లెవల్ కు చేరింది. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా (FIFA) వరల్డ్ కప్ మ్యాచ్‌లు మల్టీప్లెక్స్ స్క్రీన్లపై సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దేశంలోని ప్రముఖ సినిమా చైన్స్ PVR INOX, సినీపోలిస్ (Cinepolis) లలో ఫుట్‌బాల్ స్క్రీనింగ్స్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మూవీస్ కలెక్షన్స్ ను మించి లాభాలను సొంతం చేసుకుంటున్నారు థియేటర్ల ఓనర్స్. 

సినిమాల్లేవ్.. అంతా స్పోర్ట్స్..

థియేటర్ల యజమానులు రూటు మార్చారు. కేవలం సినిమాలపైనే ఆధారపడకుండా లైవ్ స్పోర్ట్స్, కాన్సెర్ట్స్, పాత సినిమాల రీ-రిలీజ్‌ల ద్వారా సరికొత్త బిజినెస్ మోడల్‌ను ఈ మల్టీప్లెక్స్‌లు అందిపుచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఆల్టర్నేట్ కంటెంట్ ద్వారా థియేటర్లకు 3-4  శాతం పైగా ఆదాయం వస్తోంది. మ్యాచ్ చూస్తూ పాప్‌కార్న్, కోలా ఆస్వాదించే వారి వల్ల ఫుడ్ , బెవరేజెస్ సేల్స్ కూడా ఊపందుకున్నాయి. సినిమా స్క్రీన్ అనేది అత్యంత ప్రీమియం రియల్ ఎస్టేట్.  దీనిని కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా.. 'ఫ్యూచర్ రెడీ సినిమా' వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు యజమానులు. క్రికెట్ వరల్డ్ కప్ సక్సెస్ తర్వాత, ఇప్పుడు ఫుట్‌బాల్‌తో థియేటర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను రీడిఫైన్ చేస్తున్నారు

థియేటర్లు షేక్..

గత కతార్ వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి క్రేజ్ విపరీతంగా పెరిగిందని PVR INOX సీఈఓ గౌతమ్ దత్తా తెలిపారు. సగటున 60 శాతానికి పైగా అక్యుపెన్సీ నమోదవుతుండగా, బ్రెజిల్, అర్జెంటీనా లాంటి హెవీవెయిట్ జట్లు తలపడే 'మార్క్యూ' మ్యాచ్‌లకు మాత్రం థియేటర్లు 100 శాతం హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేస్తున్నాయి. చిన్న జట్ల మ్యాచ్‌లకు రెస్పాన్స్ కాస్త సాధారణంగా ఉన్నప్పటికీ, పెద్ద మ్యాచ్‌లకు మాత్రం డిమాండ్ ఆకాశాన్ని తాకుతోందన్నారు సినీపోలిస్ ఎండీ దేవాంగ్ సంపత్ .. అందుకే సెలెక్టివ్‌గా స్క్రీన్స్ కేటాయిస్తున్నామని చెప్పారు.

ALSO READ : హీరోగా ఛాన్స్ ఇస్తానని రూ. 3.5 కోట్ల చీటింగ్..

సెలెక్టివ్‌ స్క్రీన్స్ లలో..

ముంబై, ఢిల్లీ, బెంగళూరులతో పాటు  హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, కొచ్చి వంటి నగరాల్లో ఈ ఫుట్‌బాల్ ఫీవర్ గట్టిగా నడుస్తోంది. ముంబై లాంటి మెట్రో సిటీస్ లో నాకౌట్ మ్యాచ్‌ల టికెట్ ధరలు రూ. 340 నుండి రూ. 720 వరకు ఉన్నా ఫ్యాన్స్ ఎక్కడా తగ్గట్లేదు. కేవలం డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. రాత్రి 9:30 నుండి అర్ధరాత్రి 12:30 మ్యాచ్‌లు అయినా సరే, ఫ్యామిలీలు, యువత థియేటర్లకు క్యూ కడుతున్నారు.

త్వరలో జరగబోయే సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌ల కోసం PVR INOX మరో 9 స్క్రీనింగ్స్, సినీపోలిస్ మరికొన్ని ప్రత్యేక షోలను లైన్అప్ చేశాయి. సో, ఇకపై థియేటర్లలో కేవలం 'పాప్‌కార్న్' శబ్దాలే కాదు.. 'గోల్..' అనే కేకలు కూడా మారుమోగనున్నాయి.