విస్కీ బాటిల్‌పై పెద్ద అక్షరాల్లో "Aged", "Premium", "Natural Flavour" అని కనిపిస్తే చాలామంది అది నిజంగానే ఏళ్ల పాటు నిల్వ ఉంచిన, పూర్తిగా సహజ ప్రక్రియలో తయారైన మద్యం అని అనుకుంటారు. కానీ ఆ నమ్మకానికే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై రంగంలోకి దిగిన FSSAI తాజాగా మద్యం తయారీ కంపెనీలపై ఫోకస్ పెట్టి.. వినియోగదారులను తప్పుదారి పట్టించే లేబుళ్లు, అనుమతి లేని ఫ్లేవర్ల వినియోగంపై నోటీసులు జారీ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
FSSAI 2018లో అమల్లోకి తీసుకొచ్చిన ఆల్కహాలిక్ బేవరేజెస్ రెగ్యులేషన్స్ ప్రకారం.. బ్రాండీ, జిన్, రమ్, వోడ్కా, విస్కీ వంటి మద్యం ఉత్పత్తులు తమ ప్రత్యేక రుచిని పూర్తిగా ముడి పదార్థాలు, సహజ తయారీ ప్రక్రియ ద్వారానే పొందాలి. అదనంగా కృత్రిమ లేదా అనుమతి లేని ఫ్లేవర్లను ఉపయోగించకూడదు. అయితే కొన్ని కంపెనీలు ఈ రూల్స్ ఉల్లంఘించినట్లు గుర్తించిన వాటికి షోకాజ్ నోటీసులు పంపింది.
మరో కీలక అంశం "Aged" అనే పదం వాడకం గురించే. ఒక బాటిల్‌పై "8 Years Aged" లేదా "12 Years Aged" అని రాసి ఉంటే.. ఆ బాటిల్‌లోని మొత్తం మద్యం అంతా అంతకాలం నిల్వ ఉందని వినియోగదారుడు భావించే అవకాశం ఉంటుంది. కానీ రూల్స్ ప్రకారం అలాంటి క్లెయిమ్ చేస్తే, అది బ్లెండ్‌లో ఉన్న అతి తక్కువ వయస్సు గల స్పిరిట్‌ను సూచిస్తోందని స్పష్టంగా లేబుల్‌పై పేర్కొనాలి. ఈ వివరాన్ని ఇవ్వకుండా ప్రచారం చేయడం వినియోగదారులను తప్పుదారి పట్టించడమేనని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అభిప్రాయపడుతోంది.
ఈ ఆరోపణలపై సంబంధిత కంపెనీలను ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది. అయితే ఎన్ని కంపెనీలకు నోటీసులు పంపారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. జూలై 14న పరిశ్రమ ప్రతినిధులు, సంబంధిత సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.
ALSO READ : దేశంలో పర్మనెంట్ EMIల జనరేషన్ పెరిగింది..
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ (CIABC) స్పందిస్తూ.. తమ సభ్య సంస్థలన్నీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్దేశించిన అన్ని నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నాయని పేర్కొంది. నియంత్రణ సంస్థతో జరగనున్న సంప్రదింపుల్లో పూర్తి సహకారం అందిస్తామని కూడా వెల్లడించింది.
ఆహార ఉత్పత్తుల లేబుళ్లలో పారదర్శకత, నిజమైన సమాచారం, వినియోగదారుల విశ్వాసానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు మద్యం పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. ఇకపై బాటిల్‌పై కనిపించే ప్రతి పదం, ప్రతి క్లెయిమ్ కేవలం ప్రచారం కాకుండా వాస్తవాలను ప్రతిబింబించాల్సిందేనని ప్రభుత్వం భావిస్తోంది.
