ఎన్ని షాంపూలు మార్చినా జుట్టు రాలడం తగ్గట్లేదా ? అసలు కారణం ఇదే కావచ్చు!

ఎన్ని  షాంపూలు మార్చినా జుట్టు రాలడం తగ్గట్లేదా ? అసలు కారణం ఇదే కావచ్చు!

జుట్టు రాలడం అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న పెద్ద సమస్య. ఒత్తిడి, కాలుష్యం, హార్మోన్ల సమస్యలు దీనికి కారణాలు అని అనుకుంటాం కానీ... మన శరీరంలో ప్రోటీన్ లోపం వల్లే జుట్టు ఎక్కువగా రాలుతోందని నిపుణులు చెబుతున్నారు. మనం వాడే షాంపూలు, సీరమ్‌లను మార్చే ముందు.. మన ఆహారంలో ప్రోటీన్ సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం.  

జుట్టు పెరగడానికి ప్రోటీన్ ఎందుకు
మన జుట్టు 'కెరాటిన్' అనే ఒక రకమైన ప్రోటీన్‌తో తయారవుతుంది. మనం తినే తిండిలో ప్రోటీన్ తగ్గినప్పుడు, మన శరీరం జుట్టు కంటే గుండె, కండరాలు, హార్మోన్ల వంటి ముఖ్యమైన భాగాలకే ఆ ప్రోటీన్‌ను వాడుకుంటుంది. శరీరం దృష్టిలో జుట్టు అనేది అంత ముఖ్యం కాదు కాబట్టి, ప్రోటీన్ అందక జుట్టు రాలడం మొదలవుతుంది.

ప్రోటీన్ లోపం ఎలా తెలుసుకోవాలి
జుట్టు రాలడమే కాకుండా శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది:
*జుట్టు సహజ మెరుపును కోల్పోయి, నిస్తేజంగా మారడం.
*వెంట్రుకలు పలచబడటం, త్వరగా విరిగిపోవడం.
*తల స్నానం చేసినప్పుడు లేదా దువ్వినప్పుడు గుత్తులు గుత్తులుగా రాలడం.
*గోళ్లు విరిగిపోవడం, చర్మం పొడిబారడం.

ఈ రోజుల్లో యువత తిండి విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. టైమ్‌కి తినకపోవడం, జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్ అందడం లేదు. కేవలం హెయిర్ సప్లిమెంట్లు (టాబ్లెట్లు) వాడితే సరిపోదు. మనం రోజూ తినే ఆహారంలో మార్పులు రావాలి.

తీసుకోవలసిన ఆహారం: పప్పులు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, చికెన్, సోయాబీన్, బాదం, జీడిపప్పు వంటి నట్స్  క్రమం తప్పకుండా తినాలి.

జుట్టు రాలడానికి ఇతర ఆరోగ్య సమస్యలు 
అన్ని సార్లూ పోషకాహార లోపం వల్లే జుట్టు రాలదు. కొన్నిసార్లు శరీరంలో ఉన్న ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కావచ్చు. జుట్టు రాలడంతో పాటు బాగా అలసటగా అనిపించడం, బరువు పెరగడం లేదా తగ్గడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటివి ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎందుకంటే థైరాయిడ్ సమస్యలు, ఐరన్ లోపం (రక్తహీనత), పిసిఒడి (PCOS) లేదా ఇతర హార్మోన్ల సమస్యల వల్ల కూడా జుట్టు రాలవచ్చు.

ALSO READ : Beauty: ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. 

 పైపైన వాడే షాంపూలు, నూనెల కంటే లోపల తీసుకునే ఆహారమే ముఖ్యం. ఆరోగ్యకరమైన శరీరం నుంచే ఆరోగ్యకరమైన జుట్టు వస్తుంది. ఒకవేళ మంచి ఆహారం తీసుకుంటున్నా, జుట్టు సంరక్షణ బాగున్నా జుట్టు రాలడం తగ్గకపోతే.. ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవడం   మంచిది.