న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగ్లాదేశ్ తిరిగి వెళ్లి అక్కడి కోర్టుల ముందు లొంగిపోతానని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తీవ్ర నిరసనల కారణంగా షేక్ హసీనా ఆ దేశం నుంచి పారిపోయి 2024 ఆగస్టు 5న భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, స్టూడెంట్ల నిరసనల అణచివేతలో వందలాది మంది మరణానికి కారణమయ్యారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ 2025 నవంబర్ లో ఆమెకు మరణశిక్ష విధించింది.
హసీనా అవామీ లీగ్ పార్టీని నిషేధించారు. అయితే, మొదట ముహమ్మద్ యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం, ప్రస్తుత తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్‌పీ ప్రభుత్వం హసీనాను అప్పగించాలని భారత్‌ను పదే పదే కోరుతున్నాయి. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఇందులో న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపింది.
కాగా, హసీనా ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తన ఆవేదనను, నిర్ణయాన్ని వెల్లడించారు. ‘నేను తిరిగి వెళ్తే నన్ను అరెస్ట్ చేయవచ్చు లేదా చంపేయవచ్చు. అయినా, నేను వెనకడుగు వేయను. బంగ్లాదేశ్‌లో నా పార్టీ (అవామీ లీగ్) నాయకులు, కార్యకర్తలు తీవ్ర అణచివేతకు గురవుతున్నారు. నాకు మరణమే వస్తే.. నా సొంత గడ్డపైనే రావాలని కోరుకుంటున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.
