E20 పెట్రోల్‌పై సోషల్ మీడియాలో ఆందోళనల మధ్య కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాత కార్ల యజమానులకు ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించారు. E20 పెట్రోల్ వాడకం వల్ల పాత వాహనాల్లో చెడిపోయే కొన్ని చిన్న స్పేర్స్‌ను సర్వీసింగ్ సమయంలో ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయకుండా ఉచితంగా మార్చాలని వాహన తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో E20పై పెరుగుతున్న ఆందోళనలకు గడ్కరీ నేరుగా సమాధానం ఇచ్చినట్లైంది.
పాత కార్లలో ఇంధన వ్యవస్థలో ఉపయోగించే కొన్ని వాషర్లు గతంలో మెటల్‌తో తయారై ఉండేవి. ప్రస్తుతం వాటి స్థానంలో రబ్బర్ తో తయారైన భాగాలను వినియోగిస్తున్నారని గడ్కరీ చెప్పారు. షోరూంలలో ఆథరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్లకు వచ్చే పాత కార్లలో ఈ వాషర్లను యజమానులపై అదనపు భారం లేకుండా మార్చాలని ఆటోమొబైల్ కంపెనీలకు సూచించినట్లు గడ్కరీ తెలిపారు. తనకు తెలిసినంత వరకు E20 కారణంగా ఒక్క కారు కూడా దెబ్బతిన్న ఘటన నమోదు కాలేదని అన్నారు.
E20 పెట్రోల్ వల్ల కార్లు పాడవుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గడ్కరీ తీవ్రంగా ఖండించారు. "E20 వల్ల దెబ్బతిన్న ఒక్క కారు అయినా చూపించండి" అంటూ రెండు రోజుల కిందట సవాల్ కూడా విసిరారు. దీనిపై స్పందించిన కొందరు తమ వద్ద ప్రూఫ్ ఉందంటూ బదులిచ్చారు. E20ను దేశవ్యాప్తంగా అమలు చేసే ముందు ARAIతో పాటు వాహన తయారీ సంస్థలు విస్తృతంగా పరీక్షలు నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.
ALSO READ : దేశీయ ఈవీ స్పేర్స్ మార్కెట్లో అపార అవకాశాలు..
అయితే E20తో మైలేజ్ డ్రాప్ విషయాన్ని మాత్రం గడ్కరీ ఓపెన్ గా అంగీకరించారు. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కాలొరిఫిక్ విలువ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. అయితే మైలేజ్ అనేది ట్రాఫిక్ పరిస్థితులు, డ్రైవింగ్ విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ల కోసం రూపొందించిన వాహనాల్లో మైలేజ్ సమస్య లేదని ARAI నివేదిక చెబుతోందని, భవిష్యత్తులో ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని మరింత ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వ ప్లాన్ అన్నారు గడ్కరీ. సో పాత వాహనదారులకు కొన్ని స్పేర్స్ ఉచితంగా రీప్లేస్ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఎంత వరకూ వాహనదారులకు ఊరటను కలిగిస్తాయో చూడాల్సిందే.
