- రాబోయే ఏడేళ్లలో దాదాపు 8 రెట్ల వృద్ధికి చాన్స్
- ఎక్కువ భాగాలు స్థానికంగానే తయారీ
- ఐఈఎస్ఏ, సీఈఎస్ రిపోర్ట్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) వాడకం విపరీతంగా పెరుగుతుండటంతో వీటి విడిభాగాల (స్పేర్‌పార్ట్స్) వ్యాపారంలో అపార అవకాశాలు ఉన్నాయని వెల్లడయింది. దేశీయ ఈవీ విడిభాగాల మార్కెట్ రాబోయే ఏడేళ్లలో దాదాపు 8 రెట్లు వృద్ధి చెందనుంది. 2032 నాటికి రూ.3.55 లక్షల కోట్లకు చేరుకోనుంది.
గతేడాది ఈ మార్కెట్ విలువ రూ.41వేల కోట్లు ఉంది. ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ (ఐఈఎస్ఏ), కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ (సీఈఎస్) స్టడీ రిపోర్ట్ ఈ విషయాలను బయటపెట్టింది. దీని ప్రకారం..గత ఏడాది విడిభాగాల మార్కెట్లో బ్యాటరీ ప్యాక్‌ల వాటా సగానికి పైగా ఉంది.
మోటార్లు, ఇన్వర్టర్లు, పవర్ ఎలక్ట్రానిక్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. స్పేర్స్ తయారుచేసే ఒరిజినల్ఎక్విప్మెంట్మాన్యుఫాక్చరర్లు డ్రైవ్ ట్రెయిన్ ఇంటిగ్రేషన్‌ను (వేర్వేరుగా ఉండే ముఖ్యమైన భాగాలను కలిపి సమగ్ర వ్యవస్థగా మార్చడం) పెంచుతున్నారు.
మోటార్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (బీఎమ్ఎస్) అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. అయితే బ్యాటరీ ప్యాక్‌లు, ఇన్వర్టర్లు ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ ధరలో దాదాపు 60 శాతం వరకు ఉంటున్నాయి. సాఫ్ట్‌వేర్ ఆధారిత, తక్కువ పెట్టుబడుల వల్ల మోటార్లు, బీఎమ్ఎస్లు స్థానికంగానే తయారవుతున్నాయి.
- ఏడేళ్లలో 38 శాతం గ్రోత్
ఈ మార్కెట్ 2025 నుంచి 2032 మధ్య 38 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) తో వృద్ధి చెందుతుందని అంచనా. ఈ కాలంలో రూ.3.14 లక్షల కోట్ల విలువైన అదనపు వ్యాపార అవకాశం (ఇంక్రిమెంటల్ ఆపర్చునిటీ) ఆర్ అండ్ డీ, ఉత్పాదక సామర్థ్యం, సరఫరా వ్యవస్థపై పెట్టుబడి పెట్టే స్వదేశీ కంపెనీలు దక్కించుకోవచ్చు.
భారతదేశ ఈవీ రంగ భవిష్యత్తు కేవలం అమ్మకాల పెరుగుదలపైనే కాకుండా, బలమైన సాంకేతిక యాజమాన్యం, స్థానిక సరఫరా వ్యవస్థలు, మేధో సంపత్తిని నిర్మించడంపై ఆధారపడి ఉందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు మనదేశాన్ని ప్రపంచ ఈవీ విలువ గొలుసులో మొదటిస్థానంలో నిలుపుతాయని ఈ రిపోర్టు పేర్కొంది.
