హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్‌లోని ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా కాలనీల్లో ఇండ్లు హుస్సేన్సాగర్ఎఫ్టీఎల్పరిధిలో ఉన్నాయని, వాటిని హైడ్రా కూల్చివేయబోతుందంటూ ప్రచారం జరగడంతో స్థానికులు శుక్రవారం ఉదయం నిరసన తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్మక్తా కాలనీకి వెళ్లి స్థానికులతో మాట్లాడారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న పేదల ఇండ్లను హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చదని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నమ్మవద్దని సూచించారు. రోడ్డు విస్తరణ కోసం ఆర్‌అండ్‌బీ కొందరికి నోటీసులు జారీ చేసిందని, వారికి ప్రభుత్వం నాలుగు రెట్లు నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. ఆ అంశాన్ని ఆసరాగా చేసుకుని హైడ్రా పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసులను ఆదేశించినట్లు కమిషనర్ తెలిపారు. దీంతో స్థానికులు ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు.
