ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త బిల్లు ప్రతిపాదించింది. అయితే ఎక్కడా ఈ ప్రతిపాదనలో ఈ బిల్లు అవసరం గురించి, సహేతుక కారణాల గురించి వివరణ లేదు. ఈ బిల్లుకు పీఠిక లేదు. చివరన ఉండాల్సిన ఉద్దేశాల పట్టిక లేదు. తెలంగాణా రైజింగ్ 2047 నివేదికలో తెలంగాణాను 3 భాగాలుగా విభజించారు. అందులో కోర్ అర్బన్ రీజియన్ ( క్యూర్ ) ప్రాంతం ప్రభుత్వానికి కీలకంగా మారింది.
అభివృద్ధి మీద ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో చేసే పరిశోధనలకు, ప్రాజెక్టులకు, ఆదాయానికి ఈ బిల్లు దోహదకారిగా మారే అవకాశం మెండుగా ఉన్నది. ఈ ప్రాంతంలో భూముల విలువ పెంచి తద్వారా ప్రభుత్వ ఖజానాకు నిధుల ప్రవాహం పెంచే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక రకాల ఆలోచనలు చేస్తున్నది.
ఈ ప్రాంతానికి ఒక కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు, దానికి తగినచట్టం. ఆ దిశగా 5 జులై 2026న క్యూర్ చట్టం ముసాయిదా ప్రతిపాదించింది. దీనిమీద ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలు కోరింది ప్రభుత్వం. ఈ క్యూర్ బిల్లు హైదరాబాద్ పరిధి దాటుతున్నా ముసాయిదా మాత్రం జి.హెచ్.ఎం.సి వెబ్‌సైట్‌లో ఇంగ్లిష్‌లో పెట్టి ఊరుకున్నది.
ఈ బిల్లు 271 పేజీలు ఉన్నది. మొదట్లో డౌన్‌లోడ్ చేసుకోకుండా అక్కడే చడువుకోమన్నారు.
ప్రశ్నిస్తే డౌన్‌లోడ్ ఆప్షన్ వచ్చింది. ఇంకా తెలుగులోకి అనువదించి ప్రజలకు అందుబాటులో పెడతారా లేదా తెలియదు. ఈ బిల్లు ప్రతిపాదన ఎవరు చేస్తున్నారో కూడా స్పష్టత లేదు.
ప్రభుత్వమా, జి.హెచ్.ఎం.సి? తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తే జి.హెచ్.ఎం.సి వెబ్‌సైట్‌లో మాత్రమే పెట్టడంలో అర్థం ఏమిటి?. 1.5 కోట్ల జనాభా మించనున్న ప్రాంతాన్ని ఈ బిల్లు ద్వారా ఒక నూతన వ్యవస్థ నిర్మాణం జరగనున్నది. దీని ప్రాశస్త్యం కేవలం విస్తారమైన ప్రాంతమే కాదు. ఈ ప్రాంతం తెలంగాణ జీడీపీలో దాదాపు 90 శాతం వాటా ఉంటుంది.
ఇది రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు దాని కేంద్ర ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. మొత్తం ప్రతిపాదనలు పరిశీలిస్తే తెలంగాణలో ఒక ప్రత్యేక చట్టం ద్వారా ఈ క్యూర్ ప్రాంతానికి ప్రత్యేక పాలనావ్యవస్థ
రానున్నది. ఈ బిల్లు కొత్త వ్యవస్థను ప్రతిపాదిస్తున్నది.
కొన్ని ప్రాంతాలకే అభివృద్ధి ప్రాజెక్టులు
పారదర్శకత, జవాబుదారీతనం, లేదా విధానపరమైన పర్యవేక్షణ విషయాలలో క్యూర్ బిల్లు 2026 సమన్వయం పేరిట ప్రతిపాదించిన కొత్త ప్రతిపాదన ఏమీ లేదు. ఈ కొత్త సంస్థాగత చట్రానికి ఏకైక ఎన్నికైన ప్రతినిధిగా ఉన్న ముఖ్యమంత్రి మినహా, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేయర్లు, కార్పొరేటర్లు సహా, దీని పాలనలో చోటు లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా హైదరాబాద్‌కు పశ్చిమాన ఉన్న కోకాపేట వంటి ‘ఆదర్శప్రాయమైన ఉదాహరణల’పైనే అసమానంగా దృష్టి సారించడంతో క్యూర్ ప్రాంతంలోనే వివిధ ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
ఈ అసమానతలను క్యూర్ బిల్లులో ప్రతిపాదించిన రాబడి సమీకరణ, నిర్ణయాధికార కేంద్రీకరణ వంటివి వాటిని మరింత పెంచే ప్రమాదం ఉంది. ఎస్‌ఆర్‌డీపీ, ఎస్‌ఎన్‌డీపీ, హెచ్-సిఐటీఐ వంటి ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. హైదరాబాద్ నగరం,
దాని చుట్టూ అనేక మునిసిపాలిటీలు, రంగారెడ్డి జిల్లాలో అనేక ప్రాంతాల అవసరాలను ఇదివరకు పట్టించుకోలేదు. క్యూర్ వ్యవస్థ ఏర్పాటు తరువాత ఇది ఇంకా దిగజారే పరిస్థితి రావచ్చు.
ప్రభుత్వ ఖజానాపై దీర్ఘకాలిక భారం
క్యూర్ ప్రాంత రెవెన్యూ ఒక దగ్గరకు చేర్చే ప్రతిపాదన ఈ బిల్లులో ఉన్నది. దీని పరిధిలో ఉండే 3 మునిసిపల్ కార్పొరేషన్లు అప్పుడు పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడక తప్పదు. బహుశా ఈ పరిస్థితి హైదరాబాద్ బల్దియాకు మునుపెన్నడూ రాలేదు. ఈ క్యూర్ బిల్లులు మిగతా మునిసిపాలిటిల మాదిరి ప్రభుత్వం ముందు చేతులు కట్టుకు నిలిచిపోవాల్సిందే.
రాజ్యాంగంలో పొందుపరిచిన మూడు ప్రభుత్వాలలో (కేంద్ర, రాష్ట్ర, స్థానిక) స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కూడా పడబోతున్నది. క్యూర్ బిల్లు కేవలం రెవెన్యూ కేంద్రీకృతం చేయడం, ఒకే దగ్గర కలెక్షన్ విధానం పెట్టడం ద్వారా స్వతంత్ర వ్యవస్థ అయిన హైదరాబాద్ బల్దియాను బలి తీసుకోనున్నది.
ఆర్థిక వనరులు సమానంగా పంచడానికి, ప్రాధాన్యతలు గుర్తించడానికే ప్రజాస్వామ్య వేదికలు అయిన మునిసిపల్ కార్పొరేషన్, శాసనసభ ఉన్నాయి. నిధులు అవినీతి, నాసిరకమైన నిర్వహణ వైపు మళ్లిస్తుండగా, ప్రాధాన్యత లేని ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకుంటున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాపై దీర్ఘకాలిక భారాన్ని మోపుతోంది.
సీఎం అధ్యక్షతన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు, 2026, హైదరాబాద్ కోర్ అర్బన్ జిల్లాల్లో నివసిస్తున్న కోటిమందికి పైగా ప్రజలకు నీటి బిల్లులను ఎలా లెక్కించాలి, భవన నిర్మాణ అనుమతులను ఎలా మంజూరు చేయాలి, పన్నును ఎలా నిర్ధారించాలి తదితర విషయాలను నిర్ణయిస్తుంది . దీనికి అగ్రస్థానంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఉంటుంది. ఇందులో మున్సిపల్ మంత్రి, కన్వీనర్‌గా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, చైర్‌పర్సన్ ఆహ్వానించాలనుకున్న ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు.
కౌన్సిల్‌లో ఎవరు ఉండాలి అన్నది ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా నిర్ణయించే అధికారం ఉన్నది. ఈ కౌన్సిల్ కింద క్యూర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పూర్తిగా కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, కలెక్టర్లతో నిండి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243S ప్రకారం ఈ పరిమాణంలో ఉన్న మునిసిపాలిటీలలో వార్డు కమిటీలు ఉండాలి. క్యూర్ బిల్లులో వార్డు కమిటీల ప్రస్తావన ఉన్నా వాటి పరిధి పరిమితం చేశారు. నిర్ణయాలలో, సంప్రదింపులు, వగైరా ఏమీ లేవు. ఒక వార్డులో 3 లేదా 4 కమిటీలు ఉంటాయని ఈ బిల్లు చెబుతోంది. ఎందుకు?
బిల్లును సమగ్రంగా మార్చాలి
కేంద్రీకృత విచక్షణాధికారంపై పనిచేసే ఒక నియంత్రణ వ్యవస్థ అపెక్స్ కౌన్సిలే అయి ఉండాలి. అది క్రమం తప్పకుండా సమావేశమవుతూ, పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తూకం వేస్తూ, తాను పరిపాలించే ప్రజలకు ఏదో ఒకవిధంగా జవాబుదారీగా ఉండాలి. ఆ విధంగా కూడా లేదు. ఈ వేదికకు అసలు సమావేశమవ్వాల్సిన అవసరమే లేదు.
ఈ బిల్లులో ఉన్న ఇటువంటి లోపాల వల్ల పర్యవసానంగా, ఆచరణలో, రోజువారీగా ప్రభుత్వ
యంత్రాంగాన్ని నియంత్రించే ఒకే వ్యక్తి ఈ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించవచ్చు. ఆ విధంగా చూస్తే ప్రజాస్వామిక వ్యవస్థలో ఈ బిల్లు ఘోరమైన ప్రతిపాదన. ఈ బిల్లులో ఉన్న లోపాలు, ప్రతిపాదనలకు దురుద్దేశాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. దీని రూపకర్తలు ఒక నిజమైన సమన్వయ సమస్యను పరిష్కరిస్తూ, జవాబుదారీగా పనిచేసే ఉమ్మడి సంస్థలను నిర్మించే కఠినమైన పనిని వదిలి కేవలం అలవాటుకొద్దీ కేంద్రీకరణ సాధనాలను ఆశ్రయించి ఉండవచ్చు.
ఈ బిల్లు సమీకృత, సమన్వయ పాలన గురించి మాట్లాడుతూ.. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల వాణిగానీ, ఒక సాధారణ పౌరుడి వాణిగానీ వాస్తవంగా వినిపించగల ప్రతి అవకాశాన్ని నిశ్శబ్దంగా తొలగిస్తున్నది. తెలంగాణలో సమతుల్య, సంప్రదింపులతో కూడిన సుస్థిర అభివృద్ధి జరగాలంటే ఈ బిల్లును సమూలంగా మార్చాల్సిందే.
మునిసిపల్ కార్పొరేషన్ మీద ప్రభుత్వ పెత్తనం
ఈ బిల్లులో ‘ప్రభుత్వం’ అనే పదం సుమారు 474 సార్లు కనిపిస్తున్నది. అప్రధానంగా ప్రస్తావించిన వాటిని తీసివేస్తే, మిగిలిన ‘ప్రభుత్వం చేయవచ్చు’, ‘ప్రభుత్వం తప్పక చేయాలి’, ‘ప్రత్యేకంగా ప్రభుత్వానికే చెందుతుంది’ వంటి పదాలు దాదాపు 253 సార్లు పునరావృతమవుతున్నాయి. తప్పేమీ లేదు కదా అనిపించవచ్చు. స్వతంత్రంగా ఉండాల్సిన మునిసిపల్ కార్పొరేషన్ మీద ప్రభుత్వ పెత్తనం ఈ పదాల ద్వారా సమకూరుతుంది.
తెలంగాణ ప్రభుత్వమే ఒక కేంద్రీకృత నిర్ణాయక స్థితిలో ఉంటే, దాని నీడ క్యూర్ ప్రాంతంమీద ఉంటే అది ఏ దిశగా పయనిస్తుందో అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం లేదా ప్రత్యేకంగా మునిసిపల్ మంత్రి లేదా ముఖ్యమంత్రికి పగ్గాలు అందించే ప్రతిపాదనలు ఈ బిల్లులో ఉన్నాయి. ఈ బిల్లు ఒక స్మార్ట్ గవర్నెన్స్ సెంటర్ ఏర్పాటును ప్రతిపాదిస్తుంది. ప్రతి కార్పొరేషన్ అన్ని రకాల సమాచార సేకరణ చేసి ఈ సెంటర్‌కు ఇవ్వాలి. వీటి అధికారాలను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానిదే. సరిహద్దుల మార్పులు, టారిఫ్ పెంపులు, ఫీజు మినహాయింపులు అన్నీ ప్రభుత్వ విచక్షణ పరిధిలోనే ఉంటాయి.
- డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్
గమనిక: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.
