గ్రూపులు.. డబులింజన్ కు బ్రేకులు.. తెలంగాణలో బీజేపీ కల సాకారమయ్యేనా.?

గ్రూపులు.. డబులింజన్ కు బ్రేకులు.. తెలంగాణలో బీజేపీ కల సాకారమయ్యేనా.?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ  అధికారంలోకి రావాలనే ఆశతో పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటం, ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజల్లో ఉన్న వ్యక్తిగత ఆదరణ కలిసిసొస్తుందనే భావనలో ఆ పార్టీ ఉంది. ‘2028లో మా ప్రభుత్వమే, డబుల్ ఇంజిన్ సర్కార్ ఖాయం’ అనే నినాదాలు వినిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో  పార్టీ పరిస్థితి ఆ లక్ష్యానికి అనుగుణంగా ఉందా అనే ప్రశ్న మాత్రం తలెత్తుతోంది. 

కేవలం ఢిల్లీ పెద్దల ఇమేజ్​ని చూసి తెలంగాణ ప్రజలు మన రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెట్టగలరా? ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం రోడ్లపైకి వచ్చి పోరాడాలి. కానీ, తెలంగాణ బీజేపీలో ఆ ధోరణి  రోజురోజుకీ తగ్గిపోతోంది.

బీజేపీతో లోపాయికారి రాజకీయం చేస్తుందని బీఆర్ఎస్​, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తున్నాం. నిజంగా ​ స్క్రీన్ ముందు కొట్లాట – స్క్రీన్ వెనుక దోస్తీ అనే భావన బీజేపీ స్థానిక నేతలపై  ప్రజల్లో ఏర్పడితే,  పార్టీకి అంతకంటే పెద్ద నష్టం మరొకటి ఉండదు. కొత్త రక్తాన్ని అడ్డుకునే  స్వార్థ పూరిత రాజకీయాలు, తెలంగాణలో బీజేపీ ఎదుగుదలకు అతిపెద్ద అవరోధంగా మారాయని ఆ పార్టీ నాయకులే  ప్రైవేట్​గా సెలవిస్తున్నారు. 

అడ్డుకుంటున్నరా..

ఒకవైపు జాతీయ నాయకత్వం క్రమశిక్షణ గురించి మాట్లాడుతుంటే, తెలంగాణలో మాత్రం  గ్రూపు రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. సమాజంలో మంచి పేరున్న మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్/ఐపీఎస్ అధికారులు, ప్రజల్లో పట్టున్న ఇతర పార్టీల తటస్థ నాయకులు బీజేపీలో చేరాలని చూస్తున్నప్పుడు.. స్థానిక సీనియర్ నేతలు వారిని అడ్డుకుంటున్నారు. కొత్తవాళ్లు వస్తే తమ సీట్లకు ఎసరు వస్తుందనే భయంతో పార్టీ గేట్లను మూసేసే పరిస్థితి ఉంది. 

పార్టీ అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు, కానీ తమ వ్యక్తిగత ఇమేజ్, వ్యాపారాలు సాగితే చాలనే ధోరణి కొందరు నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అగ్రనేతల మధ్య సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యం. పెద్ద నేతల మధ్య  నడిచే ఇగో  వార్ వల్ల  క్షేత్రస్థాయిలో  ఉన్న కార్యకర్తలు ఏ గ్రూపులో ఉండాలో తెలియక సతమతమవుతున్నారు. కేవలం నాయకుల చుట్టూ తిరుగుతూ, భజన చేసే ‘ఎస్ బాస్’ బ్యాచ్‌‌కే పదవులు, గౌరవాలు దక్కుతున్నాయి. 

పార్టీ కోసం జైళ్లపాలై,  లాఠీ దెబ్బలు తిన్న అసలైన కార్యకర్తలను కాదని కొత్తగా వచ్చిన డబ్బున్నవాళ్ళనే  అందలం ఎక్కిస్తున్నారనే అపవాదు ఉంది. ఇది పార్టీ  మూల సిద్ధాంతాలకే గొడ్డలిపెట్టు లాంటిది. ఒకప్పుడు బీజేపీ అంటే క్రమశిక్షణ,  నీతి నిజాయితీ గల అవినీతి రహిత పార్టీ అనే ముద్ర ఉండేది. ఇపుడు ఆ కమిట్​మెంట్​ ఏ స్థాయిలోనూ లేకుండా పోయింది.

భావోద్వేగం, అభివృద్ధి

తెలంగాణ రాజకీయాలను లోతుగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రం పూర్తిగా భావోద్వేగాలతో నడిచే సమాజం కాదు. అవసరమైతే భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తుంది, అవసరమైతే అభివృద్ధిని ఎంచుకుంటుంది. ఉద్యమ సమయంలో తెలంగాణ సెంటిమెంట్‌‌ను బలంగా ఆదరించిన ప్రజలే, ఉద్యమం తర్వాత అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నించడం ప్రారంభించారు. 

ఇదే తెలంగాణ సమాజం యొక్క ప్రత్యేకత. రాజకీయ శాస్త్రంలో ‘Retrospective Voting Theory’ అనే సిద్ధాంతం ఉంది. దీని ప్రకారం ప్రజలు గతంలో ప్రభుత్వం ఎలా పనిచేసిందో, తమ జీవితంలో ఏ మార్పు వచ్చిందో చూసి ఓటు వేస్తారు. కేవలం భావోద్వేగ ప్రసంగాలు లేదా ప్రత్యర్థులపై విమర్శలతో దీర్ఘకాలం ప్రజలను ఆకర్షించడం సాధ్యం కాదు. 

ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎన్నికల్లో ఒక ముఖ్యమైన సాధనం.  కానీ అది ఎన్నికలను పూర్తిగా నిర్ణయించదు. ట్విట్టర్, ఫేస్‌‌బుక్, ఇన్​స్టాగ్రామ్,  యూట్యూబ్  వీడియోలు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు. కానీ  ఓటు మాత్రం చివరకు స్థానిక సమస్యలు, అభ్యర్థి విశ్వసనీయత, ప్రజలతో అనుబంధం వంటి అంశాలపైనే ఆధారపడుతుంది. 

2028 కలలు!

‘2028లో  మాదే ప్రభుత్వం’ అని జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి నేతలు ఊదరగొట్టినంత మాత్రాన అధికారం రాదు. సర్జికల్ స్ట్రైక్​లాగ అన్ని విధాలుగా పార్టీ ప్రక్షాళన  అవసరం. వ్యక్తిగత వ్యాపారాలు చూసుకుంటూ,  కాంప్రమైజ్​ పాలిటిక్స్​ చేసుకునే నాయకులను గుర్తించి పార్టీ పక్కన పెట్టాలి. నిబద్ధత గల నాయకులకు, కొత్తగా వచ్చే మేధావులకు ప్రాధాన్యత ఇవ్వాలి. 

ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు సోషల్ మీడియాలో కాదు, వీధుల్లో  చేసి ప్రజల మెప్పు పొందాలి. అగ్ర నేతలంతా తమ పంతాలను పక్కన పెట్టి సమష్టిగా కృషి చేయాలి. క్యాడర్‌‌కు అండగా ఉంటామనే నమ్మకాన్ని కలిగించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీపై గౌరవం ఉన్నది కాబట్టే అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన నాయకులను సైతం  మోదీ బొమ్మతో ఎంపీలుగా గెలిపించిన విషయం మరవద్దు. రాష్ట్ర రాజకీయాల వచ్చేసరికి బీజేపీ కనీస స్థాయిలో  గెలువలేకపోతోంది. 

రాజకీయ శాస్త్రం ప్రకారం గెలుపు  నాలుగు స్తంభాలపై  ఆధారపడి ఉంటుంది, ఒకటి ప్రజల విశ్వాసం,  రెండోది బలమైన సంస్థాగత  నిర్మాణం, మూడోది నిజాయితీగల సమర్థ పార్టీ నాయకత్వం, నాలుగోది క్రమశిక్షణ గల కార్యకర్తలు, ఇందులో మూడవ అంశమే  కొరవడింది.

 తెలంగాణలో బీజేపీకి  ప్రజల్లో కొంత సానుకూల ఆదరణ గట్టిగానే ఉంది. కానీ ఆ ఆదరణను అధికారంగా మార్చగల సమర్థవంతమైన, సమష్టి నాయకత్వానిదే కొరత.  పటిమగల నాయకత్వం  క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాడితే తెలంగాణలో కమలం వికసించడం  కష్టం కాకపోవచ్చు!  తెలంగాణలో  కమలం ప్రధాన సమస్య  బలమైన  కమాండర్​  కొరతనే!

- డాక్టర్. బి. కేశవులు. మనోశాస్త్ర విశ్లేషకుడు-

 గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.