- ఆగస్టు 15 నాటికి సత్తుపల్లికి గోదావరి జలాలు
- రైతు ఆశీర్వాద సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- సీఎం రేవంత్ కు ప్రజలు అండగా నిలవాలన్న మంత్రులు
ఖమ్మం/ మధిర/ చింతకాని, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వేదికగా నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ ఘన విజయాన్ని నమోదు చేసింది. రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయడంతో జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని గణాంకాలతో సహా ఎండగట్టారు. బీఆర్ఎస్ హయాంలో అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రాన్ని, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక క్రమశిక్షణతో తిరిగి గాడిలో పెడుతున్నామని తెలిపారు. అబద్ధపు ప్రచారాలు, ఫాంహౌస్ రాజకీయాలతో రాష్ట్రాన్ని అస్థిరపరచాలని చూస్తున్న వారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ, రైతు భరోసా కలిపి 30 నెలల్లో రూ.36 వేల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేశామన్నారు. రూ.1.60 లక్షల కోట్లు రైతాంగం కోసం ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గినా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందిస్తున్నామన్నారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా యాతాలకుంట టన్నెల్ పూర్తి చేసి ఈ ఆగస్టు 15 నాటికి సత్తుపల్లికి నీళ్లు అందిస్తామని వెల్లడించారు. కొద్ది నెలల్లో జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి పాలేరుకు గోదావరి నీళ్లు తరలిస్తామన్నారు. భవిష్యత్ లో కృష్ణా నది నీళ్ల ఇబ్బందులు తలెత్తినా సీతారామ ప్రాజెక్టు తెలంగాణకు వరంగా మారుతుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలంగా మార్చడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
రైతు సంక్షేమమే ధ్యేయం: వాకిటి శ్రీహరి
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు, సకాలంలో చెల్లింపులు, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని ప్రభుత్వం ముందుకు సాగుతోందని, రైతు బాగుంటే దేశం బాగుంటుందనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల ఆశీస్సులు, సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని వాకిటిశ్రీహరి కోరారు. రైతు ఆశీర్వాద సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, రామసహాయం రఘురాం రెడ్డి, బలరాం నాయక్, ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, రాగమయి, వెంకట్రావు, ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య పాల్గొన్నారు.
