న్యూజిలాండ్ చేరుకున్న మోదీ... 

న్యూజిలాండ్ చేరుకున్న మోదీ... 
  • గత 40 ఏండ్లలో భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి
  • ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో సాదర స్వాగతం పలికిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ 

ఆక్లాండ్: ఇండోనేసియా, ఆస్ట్రేలియా దేశాల పర్యటనలు ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం న్యూజిలాండ్ చేరుకున్నారు. ఈ పర్యటనలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌‌‌‌తో చర్చలు జరపడంతో పాటు అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. గత 40 ఏళ్లలో భారత ప్రధాని న్యూజిలాండ్‌‌‌‌లో పర్యటించడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్‌‌‌‌లోని ఆక్లాండ్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సాదర స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘కొద్దిసేపటి క్రితమే ఆక్లాండ్ చేరుకున్నాను. విమానాశ్రయంలో స్వాగతం పలికినందుకు ప్రధాని లక్సన్‌‌‌‌కు ధన్యవాదాలు’’ అని మోదీ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌‌‌‌ పెట్టారు. ‘‘నాలుగు దశాబ్దాలలో న్యూజిలాండ్‌‌‌‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిది కావడంతో ఈ పర్యటన చరిత్రాత్మకమైనది. ప్రధాని లక్సన్‌‌‌‌తో చర్చలు జరపడానికి, భారత్-–న్యూజిలాండ్ మైత్రికి సంబంధించిన పూర్తి అంశాలపై చర్చించడానికి ఎదురుచూస్తున్నాను. రేపు ఆక్లాండ్‌‌‌‌లో జరిగే ఇండియన్ కమ్యూనిటీ సమావేశంలో కూడా నేను ప్రసంగిస్తాను” అని ప్రధాని పేర్కొన్నారు. 

కాగా, ఈ చరిత్రాత్మక పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా వాణిజ్యం, రక్షణ, క్రీడలు, సంస్కృతి, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి పలు రంగాలలో కొత్త సహకార మార్గాలను అన్వేషించడానికి దోహదం చేయనుందని భారత విదేశాంగ శాఖ ‘ఎక్స్’లో పేర్కొంది. మోదీ న్యూజిలాండ్ పర్యటన పురస్కరించుకుని అక్కడి ఐకానిక్ స్కై టవర్‌‌‌‌‌‌‌‌ను విద్యుత్ దీపాలతో అలంకరించారని.. ఇది మన రెండు దేశాల మధ్య స్నేహానికి ప్రతీక అని తెలిపింది. 

కాగా, ఈ మూడు దేశాల పర్యటనకు బయలుదేరే ముందు మోదీ స్పందిస్తూ.. ఈ పర్యటన భారత్ యాక్ట్ ఈస్ట్ విధానాన్ని, మహాసాగర్ విజన్‌‌‌‌ను, స్వేచ్ఛా, బహిరంగ ఇండో-–పసిఫిక్ పట్ల ఉన్న దృక్పథాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.