ఒకవేళ నన్ను చంపేస్తే ఇరాన్ను తుడిచిపెట్టేయండి: అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు

ఒకవేళ నన్ను చంపేస్తే ఇరాన్ను తుడిచిపెట్టేయండి: అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు

అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ ప్లాన్ చేస్తోందని వస్తున్న ఊహాగానాలపై ట్రంప్ స్పందించారు. చాలా కాలంగా ఇరాన్ హిట్ లిస్టులో తను ఉన్నానని.. ఒకవేళ తనను చంపేస్తే ఇరాన్ పై ఎన్నడూ లేనంతగా బాంబుల వర్షం కురిపించాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ది పోస్ట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెల్లడించారు.

 తనను  హత్య చేసేందుకు ఇరాన్ పన్నిన కుట్రలు సఫలమైతే, దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తాను ఆదేశాలు జారీ చేశానని ట్రంప్  తెలిపారు . నేను చాలా కాలంగా వారి హిట్ లిస్టులో ఉన్నాను. మనం ఎదుర్కొంటున్న సమస్య అదే.. ఒకే ఒక్క విషయం ఏమిటంటే, ఒకవేళ ఏమైనా జరిగితే, ఇరాన్ పై మునుపెన్నడూ చూడని స్థాయిలో విరుచుకుపడాలని ఆదేశాలు జారీ చేశానని చెప్పారు.

అమెరికా అధ్యక్షుడిని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని  ఇజ్రాయెల్ వెల్లడించిందన్ రిపోర్టులపై స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇరాన్ నుంచి కొత్త ప్రణాళిక ఏమీ లేదని ,  టెహ్రాన్ చాలా ఏళ్లుగా తన మరణాన్ని కోరుకుంటోందని అన్నారు. ఈ విషయంలో ఇజ్రాయెల్ క్లారిటీగా ఏదీ తేల్చలేకపోయిందని ట్రంప్ అన్నారు. 

మరోవైపు..   ఇజ్రాయెల్ నిఘా సమాచారం నిర్దిష్టంగా లేదని, ఇరాన్  అధికారిక కుట్ర ఏదీ లేదని, కానీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ అహ్మద్ వాహిది ట్రంప్ మరణాన్ని కోరుకుంటున్నాడనే సమాచారం మాత్రమే ఉందని దీనిపై CNN పేర్కొంది.

అమెరికా-ఇరాన్ వార్ సీజ్ ఫైర్ ముగిసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు  తీవ్రమయ్యాయి  . హత్యకు గురైన ఇరాన్ సుప్రీం లీడర్  అంత్యక్రియల సందర్భంగా, ఇరాన్ నిరసనకారులు ట్రంప్‌ను చంపాలని కోరుతూ భారీ బ్యానర్లను ప్రదర్శించారు. నా ఇమామ్‌ను, నా నాయకుడిని చంపిన వాడిని మనం ఎందుకు చంపకూడదు?..  స్మారక కార్యక్రమాలలో ఇరాన్ కీలక వ్యక్తులలో ఒకరు అన్నట్లు వార్తలొచ్చాయి. ట్రంప్‌ను చంపడం మన కర్తవ్యం.. ప్రపంచంలోనే అత్యంత నీచమైన వ్యక్తి ఇంకా ఎందుకు బతికి ఉన్నాడు? అంటూ ఇరాన్ లో ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

గతంలో కూడా ఇరాన్ ను తుడిచిపెట్టేయమని ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు.2025 ప్రారంభంలో, ఒకవేళ ఇరాన్ తనను హత్య చేస్తే, ఆ దేశాన్ని తుడిచిపెట్టేయమని ఆదేశాలు జారీ చేశారు. లేటెస్టుగా.. ఇరాన్ లో ట్రంప్ హత్యకు కుట్ర జరుగుతోందని వచ్చిన వార్తల క్రమంలో.. మరోసారి ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.