చైనా-పాక్ అణు విస్తరణ .. భారత్ భద్రతకు కొత్త సవాళ్లు

చైనా-పాక్ అణు విస్తరణ .. భారత్ భద్రతకు  కొత్త సవాళ్లు

ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల పరిస్థితిపై ప్రతి సంవత్సరం సమగ్ర నివేదికను విడుదల చేసే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్  పీస్ రీసెర్చ్  ఇన్‌స్టిట్యూట్ (సీప్రీ) విడుదల చేసిన 2026 నివేదిక ప్రపంచానికి ఒక హెచ్చరికలా వినిపిస్తోంది. శీతల యుద్ధం ముగిసిన తర్వాత అణు నిరాయుధీకరణ దిశగా ప్రపంచం ప్రయాణిస్తుందనే ఆశలు ఇప్పుడు క్రమంగా చెదిరిపోతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. అణ్వాయుధాలు కలిగిన తొమ్మిది దేశాలు తమ అణ్వాయుధ నిల్వలను ఆధునికీకరిస్తూనే ఉండగా,  ఆయుధ నియంత్రణ ఒప్పందాలు బలహీనపడుతున్నాయని  సీప్రీ  పేర్కొంది.  

భారత్‌కు ఈ నివేదిక  ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉంది.  ఎందుకంటే భారత భద్రతా వాతావరణం గతంతో  పోలిస్తే మరింత  సంక్లిష్టంగా  మారుతోంది.  ఒకవైపు చైనా వేగంగా తన అణు,  సైనిక శక్తిని విస్తరిస్తుండగా,  మరోవైపు పాకిస్థాన్ కూడా తన అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో భారత్ తన వ్యూహాత్మక  భద్రతా  విధానాలను  మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. 

ప్రపంచంలో  మొత్తం అణ్వాయుధాల సంఖ్య తగ్గుతున్నట్లు కనిపించినా, వాస్తవానికి  ప్రధాన అణుశక్తులన్నీ తమ ఆయుధాలను  ఆధునీకరిస్తున్నాయి.  ముఖ్యంగా చైనా 2025లో 600 ఉన్న అణ్వాయుధ నిల్వలను 2026 నాటికి 620కు పెంచుకోవడం ఆసియాలో వ్యూహాత్మక సమతుల్యతను ప్రభావితం చేసే పరిణామం.  మారుతున్న భద్రతా పరిస్థితులకు అనుగుణంగా భారత్ తన నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేసుకుంటున్నదనే సంకేతం అభిలషించవలసిందే.  

 భారత్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు.. 2025లో 180గా అంచనా వేసిన భారత అణ్వాయుధ నిల్వలు 2026లో 190కు పెరిగాయి.  భారత్ తొలిసారిగా 12 అణ్వాయుధాలను తక్షణ వినియోగ స్థితిలో ఉంచినట్లు  సీప్రీ అంచనా వేస్తోంది.  చైనా 620 అణ్వాయుధాలతో  భారత్ కంటే మూడు రెట్లు ఎక్కువ అణు సామర్థ్యాన్ని కలిగి ఉంది.  పాకిస్థాన్ 170 అణ్వాయుధాలతో భారత్‌కు సమీపస్థాయిలోనే కొనసాగుతోంది.

చైనా అణు విస్తరణ..భారత్‌కు పెరుగుతున్న సవాల్

సీప్రీ నివేదికలో అత్యంత ఆందోళనకర అంశం  చైనా అణ్వాయుధాల విస్తరణ.  ప్రస్తుతం  చైనా వద్ద సుమారు 620 అణ్వాయుధ వార్‌హెడ్లు ఉన్నట్లు అంచనా. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత వేగంగా తన అణ్వాయుధ నిల్వలను పెంచుకుంటున్న దేశంగా చైనా నిలిచింది. కొత్త క్షిపణి స్థావరాలు, అధునాతన క్షిపణుల అభివృద్ధి ద్వారా వచ్చే దశాబ్దంలో అమెరికా, రష్యాలకు సమాన స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో బీజింగ్ ముందుకు సాగుతోంది. 

భారత్‌కు ఇది కేవలం గణాంకం కాదు. లడఖ్ సరిహద్దు వివాదాలు, హిమాలయ ప్రాంతంలో చైనా మౌలిక వసతుల విస్తరణ, హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రభావం, పాకిస్థాన్‌తో దాని వ్యూహాత్మక భాగస్వామ్యం-   ఇవన్నీ భారత రక్షణ  అంచనాలను,  లెక్కలను ప్రభావితం చేస్తాయి. . అందుకే  భారత్ కూడా తన దీర్ఘశ్రేణి క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ, చైనాను దృష్టిలో ఉంచుకుని అణు నిరోధక సామర్థ్యాన్ని బలోపేతం చేస్తోంది.  సీప్రీ  ప్రకారం పాకిస్థాన్  కొత్త క్షిపణి  వ్యవస్థలను అభివృద్ధి చేస్తూ,  అణ్వాయుధ తయారీకి అవసరమైన పదార్థాల నిల్వలను పెంచుకుంటోంది.  దీంతో  భవిష్యత్తులో దాని అణ్వాయుధ నిల్వలు మరింత పెరిగే అవకాశం ఉంది. 

బాధ్యతాయుత అణుశక్తిగా భారత్

ప్రపంచంలోని అనేక అణుశక్తులతో  పోలిస్తే భారత్ ఇప్పటికీ అత్యంత బాధ్యతాయుతమైన అణువిధానాన్ని అనుసరిస్తోంది.  ‘విశ్వసనీయ కనిష్ఠ నిరోధక సామర్థ్యం’  మొదటగా వాడకూడదు వంటి సూత్రాలకు భారత్  కట్టుబడి ఉంది. అంటే,  భారత్  అణ్వాయుధాలను దాడి కోసం కాకుండా,  నిరోధక శక్తిగా మాత్రమే చూస్తోంది.  ఇతర  దేశాలు తమ అణు సామర్థ్యాలపై  గోప్యత పెంచుకుంటున్న సమయంలో  కూడా  భారత్  పారదర్శకత, బాధ్యతాయుత వైఖరిని  కొనసాగిస్తోంది. 

 ఇది  ప్రపంచ వేదికపై  భారత్‌కు విశ్వసనీయతను తెచ్చిపెట్టింది. అయితే, బాధ్యతాయుత వైఖరి అంటే బలహీనత కాదని గుర్తుంచుకోవాలి.  దేశ భద్రతకు అవసరమైన సాంకేతిక, సైనిక సామర్థ్యాలను పెంపొందించుకోవడం కూడా అంతే అవసరం.

అణ్వాయుధ  పోటీ దిశగా  ప్రపంచం

సీప్రీ నివేదికలోని పెద్ద హెచ్చరిక ఏమిటంటే  ప్రపంచం మళ్లీ అణ్వాయుధ పోటీ దిశగా కదులుతోంది. అమెరికా, -రష్యా పోటీ,  చైనా ఎదుగుదల,  యూరప్‌లో  భద్రతా సంక్షోభాలు, ఇండో–-పసిఫిక్ ప్రాంతంలో ఉద్రిక్తతలు..ఈ పరిణామాలన్నీ అణ్వాయుధాల  వినియోగం, విస్తరణపై గతంలో ఉన్న సంయమన వైఖరి క్షీణిస్తోందని, ప్రపంచం మళ్లీ అణు పోటీ దిశగా అడుగులు వేస్తోందని సూచిస్తున్నాయి.

  అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ ఒప్పందాలు బలహీనపడటం,  దేశాల మధ్య నమ్మకం తగ్గిపోవడం, అణ్వాయుధాలను రాజకీయ ప్రభావ సాధనాలుగా ఉపయోగించాలనే ధోరణి పెరగడం ప్రపంచ భద్రతకు ముప్పుగా మారింది.

భారత్‌కు ముందున్న మార్గం

ఈ పరిస్థితుల్లో  భారత్  అణ్వాయుధ పోటీలో పాల్గొనాల్సిన అవసరం లేదు.  కానీ  వ్యూహాత్మక నిర్లక్ష్యానికి కూడా చోటు ఉండకూడదు.  స్వదేశీ రక్షణ  సాంకేతికత, క్షిపణి వ్యవస్థలు, అంతరిక్ష,  సైబర్ భద్రతా సామర్థ్యాలను పెంపొందించుకోవడం  అత్యవసరం.  అదే సమయంలో ప్రపంచ అణు నిరాయుధీకరణ, శాంతి, బహుపాక్షిక దౌత్యానికి భారత్ మద్దతు కొనసాగించాలి. 

భారత్  ఎప్పటినుంచో  సమానత్వం, శాంతి,  న్యాయబద్ధమైన అంతర్జాతీయ వ్యవస్థకు  మద్దతు ఇస్తోంది. ఈ సూత్రాలను కొనసాగిస్తూ, తన భద్రతా ప్రయోజనాలను కూడా కాపాడుకోవడం నేటి అవసరం.  సీప్రీ 2026 నివేదిక ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది.  ప్రపంచం మరింత సురక్షితంగా మారడం లేదు.  మరింత ప్రమాదకరంగా మారుతోంది.  అణ్వాయుధ నిల్వలు పెరుగుతున్నాయి.  

వ్యూహాత్మక పోటీలు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు అవసరమైంది భయం కాదు, నిర్లక్ష్యమూ కాదు.  వ్యూహాత్మక స్పష్టత. బలమైన ఆర్థికవ్యవస్థ, ఆధునిక సైనిక శక్తి, విశ్వసనీయ అణు నిరోధక సామర్థ్యం, సాంకేతిక స్వావలంబన, సమర్థ దౌత్యం ఇవే  భారత భవిష్యత్ భద్రతకు ప్రధాన స్తంభాలు.  శాంతిని  కాపాడుకోవాలంటే యుద్ధానికి సిద్ధంగా ఉండాలనే  వాస్తవాన్ని ఈ  నివేదిక మరోసారి గుర్తుచేస్తోంది.  భారత్‌కు ఇదే అసలైన వ్యూహాత్మక పాఠం.

- సీహెచ్‌వీ ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్-

 గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.