- మంజీరా నది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షానికి ఆనకట్టలోకి నీరు
- మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలకు నీటి విడుదల
- ఈ నీటితో నాట్లు వేస్తున్న కొందరు రైతులు.. మరికొందరు వెనకడుగు..
- భవిష్యత్‌లో ‘సింగూర్’ నుంచి నీరు రాకుంటే పరిస్థితేంటనే ఆందోళనలో రైతులు
మెదక్/పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలోని వేలాది మంది ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టు రైతులు పంటల సాగుపై అయోమయానికి గురవుతున్నారు. మంజీరా పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షానికి ఆనకట్టలో చేరిన నీటిని రెండు కాల్వలకు విడుదల చేయడంతో కొందరు రైతులు నాట్లు వేస్తుండగా, ఆ తర్వాత సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీరు రాకుంటే ఎలా అన్ని సందేహంతో మెజారిటీ రైతులు పంటల సాగుకు వెనుకముందాడుతున్నారు. ప్రస్తుతం నాలుగు మండలాల పరిధిలోని వేలాది మంది రైతులు ‘ఈసారి పంటలు వేద్దామా.. వద్దా..’ అనే ఆలోచనతో సతమతమవుతున్నారు.
ఇదీ పరిస్థితి..
కొల్చారం మండల పరిధిలో మంజీరా నది మీద నిర్మించిన ఘనపూర్ ఆనకట్ట కింద కొల్చారం, పాపన్నపేట మండలం, మెదక్ పట్టణం, మెదక్ రూరల్ మండలం, హవేలి ఘనపూర్ మండలాల పరిధిలో సెటిల్డ్ ఆయకట్టు 21,625 ఎకరాలు ఉంది. చిలప్‌చెడ్, కొల్చారం, పాపన్నపేట, హవేలి ఘనపూర్ మండలాల పరిధిలో మంజీరా నది పరివాహక ప్రాంతంలో సుమారు 10 వేల ఎకరాల సాగు భూములు ఉన్నాయి. ఘనపూర్ ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే. ఆనకట్టలో పూడిక పేరుకుపోవడం వల్ల ఆ మేరకు కూడా నీరు నిల్వ ఉండని పరిస్థితి నెలకొంది. ఎగువన సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు నీటిలో ఘనపూర్ ఆయకట్టు పంటల సాగు కోసం 4.6 టీఎంసీల వాటా ఉంది. అయితే అక్కడ 16 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉంటేనే దిగువకు నీరు విడుదల చేయాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం సింగూర్ ప్రాజెక్ట్‌లో కేవలం 4 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వానాకాలం ప్రారంభమై నెల రోజులు గడచినా సరైన వర్షాలు కురవక పోవడంతో సింగూర్ ప్రాజెక్ట్ లోని నీరు చేరలేదు.
ఇప్పటికైతే ఘనపూర్ ఆనకట్టలోకి నీళ్లొచ్చినయ్..
మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఘనపూర్ ఆనకట్టలోకి దాదాపు పూర్తి స్థాయిలో నీరు చేరింది. ఆనకట్ట పైనుంచి పొంగి పొర్లితే నీరు వృథాగా పోతుందని, అలా కాకుండా ఆయకట్ట పరిధి మండలాల్లో ఉన్న చెరువులు నింపొచ్చన్న ఉద్దేశ్యంతో ఇరిగేషన్ అధికారులు ఆనకట్ట గేట్లు ఎత్తి మహబూబ్ నహర్, ఫతేనహర్ కాల్వలకు నీటిని విడుదల చేశారు. దీంతో తొలకరి వర్షాలు కురవగానే కొల్చారం, పాపన్నపేట, మెదక్, హవేలి ఘనపూర్ మండలాల పరిధిలో దుక్కులు దున్ని నారుమళ్లు పోసుకున్న రైతులు కాల్వలకు నీటి ప్రవాహం రావడంతో నాట్లు వేస్తున్నారు. చిలప్ చెడ్, కొల్చారం, పాపన్నపేట మండలాల పరిధిలోని మంజీరా నదీ పరివాహక ప్రాంత రైతులు సైతం నాట్లు వేస్తున్నారు.
ఎక్కువ మంది రైతులు మాత్రం వెనుకడుగు..
ఆయకట్టు పరిధిలోని మెజారిటీ రైతులు మాత్రం నాట్లు వేసేందుకు వెనకముందాడుతున్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న నీటితో వరి నాట్లు వేస్తే ఆ తర్వాత సరైన వర్షాలు కురవకపోయినా, ఘనపూర్ ఆనకట్టలోకి నీరు చేరకపోయినా, ఎగువన ఉన్న సింగూర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల కాకుంటే పంట తడులకు తండ్లాట తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఘనపూర్ ఆనకట్ట ఆయకట్టులో, మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో పంటలు సాగు చేయాలంటే ఎగువన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి వరద వచ్చి సింగూరు ప్రాజెక్టులో 16 టీఎంసీలకు పైగా నీరు చేరాల్సి ఉంటుంది.
