జర్మనీలో ఏడాదికి రూ. 25 లక్షల ప్యాకేజీతో 5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. దీనికోసం యువత జర్మనీ భాష నేర్చుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని మన యువత అందుకోవడానికి ప్రభుత్వం చెన్నూర్ లో వంద మందికి జర్మన్ భాషను నేర్పిస్తోందన్నారు. భాష నేర్చుకుంటున్నందుకు గాను విద్యార్థులకు రూ. 2000 స్టైఫండ్ కూడా ఇస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఇలా స్టైఫండ్ ఇస్తూ శిక్షణ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు.
మెదక్ జిల్లా తోటపల్లిలో ఏటీసీ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం రూ. 4500 కోట్ల భారీ వ్యయంతో 45 అత్యాధునిక సెంటర్లను, మొత్తం 120 ATC (అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల)ను ఏర్పాటు చేసి సరికొత్త టెక్నాలజీ కోర్సుల్లో శిక్షణ ఇస్తోందన్నారు. తెలంగాణలోని ATC సెంటర్ల పనితీరును చూసి, కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఒక కమిటీని వేసి, దానికి తనను చైర్మన్గా నియమించిందని తెలిపారు.
►ALSO READ | ఆయిల్ పామ్తో రైతు నష్టపోడు.. నాలుగేండ్లు ఓపిక పడ్తే పంట చేతికొస్తది: మంత్రి వివేక్
టామ్ కామ్ (TOMCOM) ద్వారా లభించే ఈ విదేశీ ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులంతా సద్వినియోగం చేసుకోవాలి. గత రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేసింది.. త్వరలోనే ఇంకో లక్ష ఉద్యోగాలను ఇవ్వబోతోంది. మన పిల్లల భవిష్యత్తును మార్చేందుకు, నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
