రోజుకు రూ. కోటి పోతున్నయ్.. జనాలను కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్

 రోజుకు రూ. కోటి పోతున్నయ్.. జనాలను కొల్లగొడుతున్న  సైబర్ క్రిమినల్స్

సైఫాబాద్ : సైబర్ నేరాల నెట్‌‌వర్క్‌‌కు మ్యూల్ అకౌంట్లు, ఘోస్ట్ సిమ్‌‌లే ప్రధాన ఆధారమని, వాటిని పూర్తిగా నిర్మూలించినప్పుడే డిజిటల్ మోసాలను అరికట్టగలమని సిటీ సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 కు ఫోన్​చేస్తే డబ్బు తిరిగి పొందే అవకాశాలుమెరుగుపడతాయన్నారు. ఎఫ్‌‌టీసీసీఐ, హైదరాబాద్ సిటీ పోలీస్ సంయుక్తంగా రెడ్​హిల్స్ ఫెడరేషన్ హౌస్‌‌లో ‘డిజిటల్ ట్రస్ట్ అండ్ సిటిజన్ ప్రొటెక్షన్ అంశంపై  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

 ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ​ప్రజలు సైబర్​ మోసాల ద్వారా రోజుకు రూ. కోటి   కోల్పోతున్నారన్నారు. భవిష్యత్తులో ‘మా బ్యాంకులో ఒక్క మ్యూల్ అకౌంట్ కూడా లేదు’ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి రావాలన్నారు. డిజిటల్ మోసాలను గుర్తించడం, నివారించడం, ఫిర్యాదు చేసే విధానంపై  రూపొందించిన సిటిజన్స్ హ్యాండ్‌‌బుక్ ఆన్ డిజిటల్ ఫ్రాడ్ అవేర్‌‌నెస్ అండ్ ప్రివెన్షన్ ను విడుదల చేశారు. 

ఎఫ్‌‌టీసీసీఐ అధ్యక్షుడు ఆర్. రవికుమార్, డీసీపీ (సైబర్ క్రైమ్స్) వి. అరవింద్ బాబు, బ్యాంకింగ్, టెలికాం, సైబర్ భద్రత, న్యాయ రంగాల నిపుణులు పాల్గొని డీప్‌‌ఫేక్‌‌లు, ఏఐ ఆధారిత మోసాలు, బ్యాంకింగ్ భద్రత, డిజిటల్ గుర్తింపు రక్షణ, సైబర్ నేరాల నివారణపై చర్చించారు. 200 మందికి పైగా పరిశ్రమల ప్రతినిధులు, బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు, పౌరులు హాజరయ్యారు.