రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం.. పోక్సో కేసు పెట్టినందుకు ఆరుగురిని చంపిన దుర్మార్గుడు

రంగారెడ్డి జిల్లా షాబాద్లో దారుణం.. పోక్సో కేసు పెట్టినందుకు ఆరుగురిని చంపిన దుర్మార్గుడు

మైనర్ పై అత్యాచార వేధింపుల ఆరోపణలతో.. పోక్సో కేసులో అరెస్టైన మృగం.. బెయిల్ పై బయటికొచ్చి అత్యంత క్రూర దారుణానికి పాల్పడ్డాడు. పోక్సో కేసు పెట్టారనే కసితో ఆరుగురిని చంపేశాడు దుర్మార్గుడు. శుక్రవారం (జులై 10) అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం దైవాలగూడలో పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురిని దారుణంగా చంపాడు కిరాతకుడు. బెయిల్ పై బయటికి వచ్చిన కిరాతకకుడు.. మొదటగా ఇంటికి వెళ్లి  తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబంలో  మరో ముగ్గురిని హత్య చేశాడు.

 బాలికను వేధించినందుకు రాజ్‌కుమార్‌పై మే 16న పోక్సో కేసు నమోదైంది. మే 26న అరెస్ట్ అయి జైలుకెళ్లిన దుర్మార్గుడు.. శుక్రవారం (జులై 10) బెయిల్‌పై తిరిగి వచ్చి అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లి తన  భార్య, ఇద్దరు పిల్లల హత్య చేశాడు. ఆ తర్వాత  బాధిత బాలిక, బాలిక తల్లి, నాయనమ్మలను  హత్య చేశాడు. బాలికను ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు.

  • మృతుల వివరాలు ఇవే:

వరుస హత్యలు చేసి  పరారైన నిందితుడు రాజ్‌కుమార్‌ ఆ తర్వాత విషయం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. ఆరుగురిని చంపేశానని..  తాను కూడా చనిపోతున్నట్టు పేరెంట్స్ తో పాటు బంధువులకు ఫోన్లు చేశాడు.  హత్యల గురించి కొడుకు ఫోన్ చేసిన వెంటనే ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులకు  సమాచారం ఇచ్చారు. రాక్షసుడు రాజ్ కుమార్ దాడిలో చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మి (45), మైనర్‌ బాలిక (17), భార్య పార్వతి సరిత (30), కుమారుడు పరీక్షిత్ (3), కుమార్తె దైవిక్షిత్ (2)   చనిపోయారు. 

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న ఈ ఘటనలో నిందితుడి కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. డాగ్ స్క్వాడ్ బృందాలతో వెతుకుతున్నారు.