జులై 15 నుంచి అమల్లోకి ఈహెచ్‌‌‌‌ఎస్..క్యూఆర్ కోడ్తో డిజిటల్ కార్డులు

జులై 15 నుంచి అమల్లోకి ఈహెచ్‌‌‌‌ఎస్..క్యూఆర్ కోడ్తో డిజిటల్ కార్డులు
  •     ఉద్యోగ సంఘాల లీడర్లతో సీఎస్​ సమావేశం   

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల దశాబ్దాల నాటి క్యాష్​లెస్​ వైద్యం  ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను ఈ నెల 15 నుంచి అమలు చేయనున్నారు. సెక్రటేరియెట్‌‌‌‌లో శుక్రవారం సీఎస్​ సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో  సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాబోయే నాలుగు రోజుల్లో కొత్త ‘ఈహెచ్‌‌‌‌ఎస్’ మార్గదర్శకాలతో కూడిన జీవోను విడుదల చేయనుండగా, నూతన గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌పై  ఈహెచ్‌‌‌‌ఎస్  సీఈఓతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తూ, క్యూఆర్ కోడ్‌‌‌‌తో కూడిన ఆధునిక హెల్త్ కార్డులను మొబైల్ నుంచే నేరుగా డౌన్‌‌‌‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించడంతో పాటు, వైద్య వివరాలన్నింటితో కూడిన ‘ఈహెచ్​సీటీ’ యాప్‌‌‌‌ను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. 

 సీజీహెచ్ఎస్ రేట్లతో వెల్‌‌‌‌నెస్ సెంటర్లు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 943 ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈ హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులకు పూర్తి ఉచితంగా క్యాష్​లెస్​ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నూతన విధానంలో దాదాపు 2,594 రకాల మెడికల్ ప్రొసీజర్స్  కవర్ కానుండగా, వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం రేట్లను వర్తింపజేయాలని ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలు, మందుల పంపిణీ కోసం పూర్తి ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో అత్యాధునిక ‘వెల్‌‌‌‌నెస్ సెంటర్లు’ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు ఏలూరి శ్రీనివాసరావు, బి.శ్యామ్, లచ్చిరెడ్డి, రమేశ్​పాక, మారం జగదీశ్వర్, దామోదర్ రెడ్డి, చావా రవి, శ్రీనివాస్ రెడ్డి (సెక్రటేరియెట్ అసోసియేషన్), వంగా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.