టీజీఎల్‌‌డీఏకు రావాల్సిన రూ.100 కోట్లు ఇవ్వాలి..ఏపీ సీఎంకు టీజీఎల్‌‌డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ లేఖ

టీజీఎల్‌‌డీఏకు రావాల్సిన రూ.100 కోట్లు ఇవ్వాలి..ఏపీ సీఎంకు టీజీఎల్‌‌డీఏ  చైర్మన్ చరణ్ కౌశిక్ లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ లైవ్‌‌స్టాక్ డెవలప్‌‌మెంట్ ఏజెన్సీ (టీజీఎల్‌‌డీఏ)కి రావాల్సిన రూ.100 కోట్ల వాటాను వెంటనే విడుదల చేయాలని టీజీఎల్‌‌డీఏ చైర్మన్ డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లైవ్‌‌స్టాక్ డెవలప్‌‌మెంట్ ఏజెన్సీ (ఏపీఎల్‌‌డీఏ) ఆస్తుల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదని లేఖలో పేర్కొన్నారు. 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం బ్యాంకుల్లో ఉన్న నగదు నిల్వలను రెండు రాష్ట్రాల మధ్య జనాభా నిష్పత్తి ప్రకారం పంచాలని గుర్తు చేశారు. 

2014 జూన్ నాటికి ఉమ్మడి ఏపీఎల్‌‌డీఏ ఖాతాల్లో దాదాపు రూ.100 కోట్ల బ్యాంకు నిల్వలు ఉన్నాయని, వాటిపై వచ్చిన వడ్డీతో కలిపి తెలంగాణకు రావాల్సిన వాటా ఇంకా అందలేదని తెలిపారు. దీంతో టీజీఎల్‌‌డీఏ చాలా నష్టపోయిందని చెప్పారు. ఈ సమస్యను వ్యక్తిగతంగా పరిశీలించి, తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబును కోరారు. ఆ డబ్బు వస్తే రాష్ట్రంలో పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తరించడంతో పాటు పశుపోషకులకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు.