ఏఎన్‌ఎం ప్రైమరీ మెరిట్ లిస్ట్ రిలీజ్

ఏఎన్‌ఎం ప్రైమరీ మెరిట్ లిస్ట్ రిలీజ్
  • ఈ నెల 13 నుంచి 15 వరకు అభ్యంతరాలకు చాన్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫీమేల్) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ప్రైమరీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది మే 14న నిర్వహించిన రాత పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవలకు ఇచ్చే వెయిటేజీ మార్కులను కలిపి ఈ జాబితాను తయారు చేశారు.

గతంలో మే 18 నుంచి 22 వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన తర్వాత బోర్డు మెరిట్ లిస్ట్‌ను ప్రకటించింది. ఈ లిస్ట్‌పై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు మరోసారి అవకాశం వినియోగించుకోవచ్చని బోర్డు తెలిపింది. ఈ నెల 13 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో తమ లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు నమోదు చేయవచ్చని పేర్కొంది. అభ్యంతరాలను ఒక్కసారి మాత్రమే నమోదు చేసే అవకాశం ఉంటుందని, అభ్యర్థులు వివరాలను జాగ్రత్తగా పరిశీలించి ఫిర్యాదులు పంపాలని బోర్డు సూచించింది.