హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న విభేదాలపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌కు అప్పగించిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి సురేఖ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరితో ఏర్పడిన విభేదాలు, తన శాఖ పనుల్లో ఆయన జోక్యం చేసుకున్న తీరు, గతంలో జరిగిన కొన్ని అంశాల గురించి సురేఖ సచిన్ సావంత్‌కు వివరించినట్లు సమాచారం.
అనంతరం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు కూడా సురేఖతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోవద్దని, మంత్రిగా మీ బాధ్యతలు మీరు చూసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించినట్లు సమాచారం. మిగతా వ్యవహారాన్ని పార్టీ నాయకత్వమే చూసుకుంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
