- వ్యాపారవేత్త ఇంటిపై దాడి చేసిన నలుగురు దుండగులు మృతి
- మరో నిందితుడికీ తగిలిన బుల్లెట్స్
- ముగ్గురు పోలీసులకు గాయాలు
హర్యానా గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో గురువారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంటిపై దాడికి వచ్చిన నలుగురు దుండగులు పోలీసుల ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మరణించారు.
చండీగఢ్: హర్యానా గురుగ్రామ్‌లోని సుశాంత్ లోక్ ఫేజ్-2 ప్రాంతంలో గురువారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంటిపై దాడికి వచ్చిన నలుగురు దుండగులు పోలీసుల ఎదురుకాల్పుల్లో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనలో మరొక దుండగుడు తీవ్రంగా గాయపడగా.. ముగ్గురు పోలీసు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. విదేశాల్లో ఉండే ఓ గ్యాంగ్‌స్టర్ నుంచి వ్యాపారవేత్తకు వరుసగా బెదిరింపులు, డబ్బులు ఇవ్వాలంటూ కాల్స్ వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
గురువారం రాత్రి వ్యాపారవేత్త ఇంటి వద్ద కొందరు దుండగులు కారులో ఆయుధాలతో తిరుగుతుండటంతో అప్రమత్తమయ్యారు. పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే..దుండగులు తుపాకులతో వ్యాపారవేత్త ఇంటిపైకి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. పోలీసులు వారిని లొంగిపోవాలని హెచ్చరించినా.. దుండగులు ఏమాత్రం భయపడకుండా పోలీసుల వైపు కూడా బుల్లెట్ల వర్షం కురిపించారు. దాంతో ఆత్మరక్షణ కోసం పోలీసులుఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఇరువర్గాల మధ్య జరిగిన భీకర పోరులో ఐదుగురు దుండగులకు బుల్లెట్లు తగిలాయి. పోలీసులు వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో నలుగురు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతం గాయపడిన ఐదో నిందితుడితో పాటు ముగ్గురు పోలీసులకు చికిత్స అందిస్తున్నారు. కాగా, కాల్పుల ఘటన గురుగ్రామ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది.
