ఇరాన్‌తో చర్చలకు ఓకే.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 

ఇరాన్‌తో చర్చలకు ఓకే.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 

వాషింగ్టన్: ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. అదేసమయంలో చర్చల కొనసాగింపునకు మాత్రం అంగీకరించామని తెలిపారు. శుక్రవారం ట్రూత్ సోషల్ వేదికగా ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘చర్చలు కొనసాగించాలని ఇరాన్ మమ్మల్ని కోరింది. అందుకు మేం అంగీకరించాం. కానీ కాల్పుల విరమణ ముగిసిపోయిందని ఎటువంటి సందేహాలకూ తావులేకుండా అమెరికా వారికి స్పష్టం చేసింది”అని పేర్కొన్నారు. 

కాగా, హార్మూజ్ జలసంధిలో మూడు ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ సైన్యం ఇటీవల దాడి చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనికి ప్రతీకారంగా ఆ దేశంలోని అనేక స్థావరాలపై అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించాయి. బుధ, గురువారాల్లో ఇరు దేశాల మధ్య భీకర దాడులు చోటుచేసుకోగా, శుక్రవారం మాత్రం ఎలాంటి దాడులు, ప్రతిదాడులు జరిగినట్టు వార్తలు రాలేదు. 

అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి, హార్మూజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకల గురించి చర్చించడానికి ఖతార్ అధికారులు శుక్రవారం ఇరాన్ అధికారులతో భేటీ కానున్నారని రాయిటర్స్ వెల్లడించింది.