మాడ్రిడ్: స్పెయిన్‌లో తీవ్ర ఎండలు, వడగాలుల వల్ల భారీ కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. మరో 23 మంది గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు బ్రిటన్‌కు చెందినవాళ్లు ఉన్నారు. దక్షిణ అల్మేరియా ప్రాంతంలో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. కార్లలో పారిపోతున్న కొందరు మంటల్లో చిక్కుకుని వెహికల్స్‌తో పాటు కాలిపోయారు. కిందపడిన విద్యుత్ తీగ నుంచి వచ్చిన నిప్పురవ్వల వల్లే మంటలు అంటుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.
అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా ఎండిపోయిన నదీ మార్గంలో నడుచుకుంటూ వెళ్లిన ఓ గ్రూప్ కూడా మంటల్లో చిక్కుకుందని అండలూసియా అత్యవసర సేవల అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దాదాపు 3,200 హెక్టార్ల అటవీ భూమి కాలిపోయింది. మంటలు ఆర్పేందుకు 150 మంది అగ్నిమాపక సిబ్బంది, 220 మంది సైనికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
