గద్వాల, వెలుగు: ఆగస్టు వరకు జూరాల ప్రాజెక్టుకు వరద వస్తేనే పంట కాలువలకు నీరిస్తామని, లేదంటే ఈసారి జూరాల, నెట్టెంపాడు, ఆర్డీఎస్ పరిధిలో సాగునీరు అందించలేని పరిస్థితి ఉందని వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం గద్వాల జిల్లా కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప, జూరాల ప్రాజెక్ట్ డిప్యూటీ ఇంజనీర్ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 9.75 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 2.022 టీఎంసీల లైవ్ నిల్వ మాత్రమే ఉందని, దీనిని తాగునీటి అవసరాలకే వినియోగించాల్సి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జూరాల లెఫ్ట్, రైట్ కాలువలతో పాటు నెట్టెంపాడు లిఫ్ట్, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ పరిధిలోని 3,89,700 ఎకరాల ఆయకట్టు రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు.
