డైరెక్టర్ వెట్రిమారన్ (Vetrimaaran).. ఈ పేరు ఇండియా సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన దర్శకుడిగా పేరు పొందిన వ్యక్తి. కథలో కసి.. తెరకెక్కించడంలో నిజాయితీ.. వెట్రిమారన్ స్టైల్. విభిన్న కథలకు, వాస్తవిక చిత్రాలకు పెట్టింది పేరు వెట్రిమారన్ (Vetrimaaran). ఇప్పటిదాకా ఆయన తీసిన సినిమాలన్నీ ఆడియెన్స్‌ని కదిలించే కథలతో వచ్చినవే. ఆయన కథను ఎంత స్ట్రాంగ్‌గా రాస్తాడో, అంతే పవర్‌ఫుల్‌గా స్క్రీన్‌పై ప్రజెంట్ చేయగలిగే దమ్మున్న దర్శకుడతను. అందుకే ఆయన సినిమాల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన 'విడుదలై పార్ట్-1, & 2' బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, వెట్రిమారన్ మరోసారి తన సత్తా చాటారు. ఈ క్రమంలోనే వెట్రిమారన్ తన కొత్త సినిమా ప్రకటించి తెలుగు, తమిళ సినీ వర్గాలతో పాటుగా ఎన్టీఆర్, ధనుష్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే..
హాట్ టాపిక్గా మారిన ‘తమిళ్ మురుగన్’టైటిల్..
ధనుష్, వెట్రిమారన్ కాంబినేషన్‌లో మరో ఇంట్రెస్టింగ్ సినిమా వస్తుంది. ‘తమిళ్ మురుగన్’ (Thamizh Murugan) అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే మైథాలజీ థ్రిల్లర్గా రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, సినిమాపై అంచనాలు పెంచింది. పోస్టర్‌లో ధనుష్ ఏనుగుపై స్వారీ చేస్తూ, చేతిలో ‘ఈటె’తో పవర్‌ఫుల్‌గా కనిపించారు. తమిళ సంస్కృతి, శ్రీ మురుగన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ కవయిత్రి అరివుమతి కథ అందించగా, యువ టాలెంటెడ్ సాయి అభ్యాంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కూడా శ్రీ మురుగన్ కథాంశం నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ముఖ్యంగా ఆ చిత్ర నిర్మాత నాగవంశీ చేసిన ‘‘శ్రీ మురుగన్ ఉత్తర భారతదేశంలో జన్మించారు’’ అనే వ్యాఖ్య తమిళనాడులో పెద్ద వివాదానికి దారితీసింది.
The Son of Shiva.
— Jr NTR (@tarak9999) June 29, 2026
The Pride of Parvathi.
The Eternal Commander.
And, once again with TRIVIKRAM.#NTRxTrivikram pic.twitter.com/oIW7o4PETu
ఈ కామెంట్ తమిళుల ఆరాధ్య దైవమైన శ్రీ మురుగన్‌కు సంబంధించిన సాంస్కృతిక, చారిత్రక విశ్వాసాలను విస్మరించేలా ఉందంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ ప్రజల ఆరాధ్య దైవం మురుగన్ను ఉత్తర భారత దైవంగా చూపడం సరికాదని.. కార్తికేయ స్వామి తమిళనాడు రాష్ట్ర ఆరాధ్య దైవమని.. తమిళుల మనోభావాలు దెబ్బ తీసేలా పురాణాలను వక్రీకరించి ఇష్టారీతిన సినిమాలు తీస్తే ఊరుకునేదే లేదని ఫైర్ అయ్యారు.
ధనుష్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్..
ఈ నేపథ్యంలోనే ధనుష్–వెట్రిమారన్ కాంబినేషన్‌లో ప్రకటించిన ‘తమిళ్ మురుగన్’ చిత్రం హాట్ టాపిక్గా మారింది. ‘తమిళ్ మురుగన్’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన ధనుష్, పోస్టర్‌తో పాటు ఆసక్తికరమైన వ్యాఖ్యను కూడా పంచుకున్నారు. ‘‘తమిళుల శాశ్వత రక్షకుడు.. యోధుడు.. రాజు.. నాయకుడు. తమిళ జాతి, తమిళ నేలలకు ప్రతీక అయిన శ్రీ తమిళ్ మురుగన్’’ అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే #SonOfKottravai అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించారు. ప్రస్తుతం ధనుష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The Eternal Protector, warrior, THE KING & LEADER of the Thamizh people and lands.#sonofkottravai
— Dhanush (@dhanushkraja) July 10, 2026
தமிழ் முருகன் 🙏🙏🙏
THAMIZH MURUGAN https://t.co/3wjGHGfAjG
ఈ క్రమంలోనే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా వివాదానికి సమాధానంగా ధనుష్ మూవీ వస్తుందని తమిళ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. అయితే చిత్రబృందం నుంచి సినిమా కాన్సెప్ట్పై క్లారిటీ వస్తే అసలు విషయం బయటకిరాదు. అయినప్పటికీ.. తమిళ సంస్కృతి, శ్రీ మురుగన్‌కు తమిళనాడులో ఉన్న ప్రత్యేక స్థానం, ప్రాంతీయ గుర్తింపును ఈ సినిమా ప్రధానంగా చాటి చెప్పబోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వివాదం.. హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెడుతుందా? లేదా చరిత్రపుటల్లో దాగున్న కొత్త విషయాలను బయటకితీస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది.
ధనుష్–వెట్రిమారన్ ఐదో సినిమా..
ధనుష్–వెట్రిమారన్ కాంబినేషన్‌లో ఇది ఐదో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన 'పొల్లాధవన్', 'ఆడుకళం', 'వడ చెన్నై', 'అసురన్' చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు వసూళ్ల పరంగా మంచి విజయాలు సాధించాయి. అయితే, వీరి కాంబోలోనే 'వడ చెన్నై 2: అன்பువిన్ ఎళుచి' చిత్రాన్ని కూడా ప్రకటించినప్పటికీ, ఈ సినిమాల షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు.
