భారతదేశంలో భక్తికి, ఆధ్యాత్మికతకే కాదు... అపారమైన సంపదకు కూడా కొదవలేదు. మన దేశంలో కొన్ని దేవాలయాల దగ్గర ఉన్న ఆస్తులు, బంగారం, నగదు విలువ వింటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. కొన్ని ఆలయాల సంపద ఏకంగా చిన్న దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ అంటే నమ్ముతారా..? ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ర్యాంకులు ఇవ్వకపోయినా... ఆలయ ట్రస్టులు, కోర్టు రికార్డులు, ఆర్థిక నివేదికల ఆధారంగా భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల ఆసక్తికర విశేషాలు మీకోసం..!
1. తిరుమల వెంకటేశ్వర స్వామి (ఆంధ్రప్రదేశ్) – సంపదలో నంబర్ 1
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఏటా మూడు కోట్ల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసిన శ్వేతపత్రం ప్రకారం, ఈ ఆలయ నికర ఆస్తి విలువ అక్షరాలా రూ.2.26 లక్షల కోట్లు!
వార్షిక ఆదాయం: రూ.5,100 కోట్లకు పైమాటే.
హుండీ విరాళాలు: కేవలం భక్తులు ఇచ్చే కానుకల రూపంలోనే ఏటా సుమారు రూ.1,500 కోట్లు వస్తాయి.
టన్నుల కొద్దీ బంగారం, వేల కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దేశవ్యాప్తంగా ఉన్న భూములతో టీటీడీ దేశంలోనే అత్యంత ధనిక ఆలయ ట్రస్ట్‌గా నిలిచింది.
2. శ్రీ పద్మనాభస్వామి ఆలయం (కేరళ) – తెరవని రహస్యం
తిరువనంతపురంలోని ఈ పురాతన ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా గుర్తింపు పొందింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఇక్కడి భూగర్భ గదులను తెరిచినప్పుడు బయటపడ్డ నిధి విలువ చూసి ప్రపంచమే ముక్కున వేలేసుకుంది.
కనుగొన్న నిధి విలువ: రూ.1.2 లక్షల కోట్లకు పైగా విలువైన బంగారు విగ్రహాలు, వజ్రాలు, పురాతన నాణేలు, నవరత్నాలు దొరికాయి. ట్విస్ట్ ఏంటంటే... ఇప్పటికీ 'వాల్ట్ బి' (room B)ని తెరవలేదు. ఒకవేళ ఆ రహస్య గదిని కూడా తెరిస్తే, ఈ ఆలయ సంపద విలువ ఊహకందని స్థాయికి చేరుకుంటుంది.
3. షిర్డీ సాయిబాబా ఆలయం (మహారాష్ట్ర) –వేల కోట్ల నిధులు
కులమతాలకు అతీతంగా కోట్ల మంది భక్తులు కొలిచే సాయిబాబా గుడి, దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే పుణ్యక్షేత్రాలలో ఒకటి.
ఆస్తుల విలువ: రూ.2,500 నుండి రూ.3,000 కోట్లు.
వార్షిక ఆదాయం: ఏటా రూ.400 నుండి రూ.700 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
విశేషం ఏంటంటే.. ఈ డబ్బును కేవలం దాచి ఉంచడం లేదు. సాయిబాబా సంస్థాన్ ఈ నిధులతో పెద్ద పెద్ద ఆసుపత్రులు, విద్యాసంస్థలు నడుపుతూ ఎంతోమంది పేదలకు ఉచిత సేవలు అందిస్తోంది.
4. గురువాయూర్ దేవాలయం (కేరళ) – దక్షిణ ద్వారక వైభవం
కృష్ణ పరమాత్ముడు కొలువైన గురువాయూర్ ఆలయాన్ని 'దక్షిణ ద్వారక' అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు సమర్పించే కానుకల వల్ల ఆలయ సంపద భారీగా పెరిగింది.
ఆస్తుల విలువ: రూ.1,700 నుండి రూ.2,500 కోట్లు.
వార్షిక ఆదాయం: రూ.250 నుండి రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఈ నిధులతో ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
5. మాతా వైష్ణో దేవి ఆలయం (జమ్మూ & కాశ్మీర్)
కశ్మీర్‌లోని త్రికూట పర్వతాలపై ఉన్న వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు కష్టమైన కొండ దారిని సైతం లెక్కచేయకుండా వస్తుంటారు.
ఆస్తుల విలువ: రూ.2,000 కోట్లకు పైగా.
గత ఏడాది ఆదాయం (2023–24): రూ.683 కోట్లు.
కేవలం విరాళాల రూపంలోనే రూ.255 కోట్లు రాగా.. మిగతా ఆదాయం భక్తుల వసతి, హెలికాప్టర్ సర్వీసులు, ఇతర సేవల ద్వారా లభిస్తుంది.
6. సిద్ధివినాయక దేవాలయం (ముంబై) – సెలబ్రిటీల ఇష్టదైవం
ముంబైలోని ఈ గణపతి ఆలయానికి బాలీవుడ్ స్టార్స్, పెద్ద పెద్ద బిజినెస్ మేగ్నెట్స్, రాజకీయ నాయకులు క్యూ కడుతుంటారు.
ఆస్తుల విలువ: రూ.500 కోట్లకు పైమాటే.
వార్షిక ఆదాయం: సుమారు రూ.100 నుండి రూ.130 కోట్లు. ఈ ఆలయ ట్రస్ట్ ముంబై చుట్టుపక్కల ఆరోగ్య, విద్యా రంగాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గుర్తింపు పొందింది.
ఇత్తర అత్యంత సంపన్న దేవాలయాలు..
ఈ టాప్-6 మాత్రమే కాదు, మన దేశంలో వందల కోట్ల సంపద ఉన్న మరికొన్ని ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి.
అయోధ్య రామ్ మందిర్ (ఉత్తర ప్రదేశ్): ఈ ఆలయం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు కేవలం విరాళాల రూపంలోనే రూ.3,500 కోట్లకు పైగా వచ్చాయి.
గోల్డెన్ టెంపుల్ (అమృత్‌సర్): సిక్కుల పవిత్ర క్షేత్రమైన ఇక్కడికి ఏటా వందల కోట్ల రూపాయల విరాళాలు వస్తుంటాయి.
పూరీ జగన్నాథ ఆలయం (ఒడిశా): ఈ ఆలయానికి దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల భూములు, శతాబ్దాల నాటి విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి.
శబరిమల అయ్యప్ప ఆలయం (కేరళ): కేవలం రెండు, మూడు నెలల యాత్రా కాలంలోనే ఈ ఆలయానికి ఏకంగా రూ.300 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.
కాశీ విశ్వనాథ్ (యూపీ), సోమనాథ్ (గుజరాత్), మదురై మీనాక్షి అమ్మన్ (తమిళనాడు), ఉజ్జయిని మహాకాళేశ్వర్ (మధ్యప్రదేశ్): ఈ ఆలయాల ఆస్తులు, వార్షిక ఆదాయం కూడా వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది.
భారతదేశంలోని దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలోనూ, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్న భారీ సంస్థలు అని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది కదూ!
