బెంగళూరు.. ఒకప్పుడు ఐటీ ఉద్యోగాలకు డ్రీమ్ సిటీ. కానీ ఏఐ రాకతో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయనే చర్చ జోరుగా సాగుతోంది. క్యాంపస్ ప్లేస్‌మెంట్లు తగ్గడం, కంపెనీలు రిక్రూట్మెంట్లలో జాగ్రత్తలు, అనుభవం ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఫ్రెషర్లకు ఉద్యోగం దొరకడం కష్టసాధ్యంగా మారింది. దీనికి అద్దం పట్టేలా ఓ బీటెక్ గ్రాడ్యుయేట్ సోషల్ మీడియాలో పంచుకున్న అనుభవం ఇప్పుడు వేలాది మంది యువతలో చర్చనీయాంశంగా మారింది. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 500కుపైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాకపోవడం ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది.
బెంగళూరుకు చెందిన 2026 బీటెక్ గ్రాడ్యుయేట్ తన బాధను రెడిట్ వేదికగా పంచుకున్నాడు. లింక్డ్‌ఇన్, ప్రముఖ జాబ్ పోర్టల్స్, కంపెనీల కెరీర్ పేజీలు, స్టార్టప్ వెబ్‌సైట్లు ఇలా అవకాశం కనిపించిన ప్రతిచోటా జాబ్ కోసం అప్లై చేసినట్లు తెలిపాడు. అయినప్పటికీ ఒక్క ఇంటర్వ్యూకు కూడా పిలుపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. భారీ జీతం, పేరున్న కంపెనీ తన లక్ష్యం కాదని, పని నేర్చుకునే అవకాశం, వర్క్ ఎక్స్పీరియన్స్ లభించే ఉద్యోగం దొరికినా సరిపోతుందని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది.
తాను ఎర్లీ-స్టేజ్ స్టార్టప్‌లో పనిచేయడానికైనా సిద్ధమేనని, నిజమైన టెక్ ఉద్యోగం ఉంటే ఎక్కడైనా చేరతానని ఆ యువకుడు పేర్కొన్నాడు. చివరకు ఇంకేం చేయాలో అర్థం కాక రెడిట్‌లో సహాయం కోరాల్సి వచ్చిందని వెల్లడించాడు. “500కుపైగా ఉద్యోగాలకు అప్లై చేశాను.. కానీ ఒక్క ఇంటర్వ్యూ కూడా రాలేదు” అనే హెడ్డింగ్ తో చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ పోస్టుకు స్పందించిన యువత కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. ఇటీవలే చదువు పూర్తిచేసిన మరో గ్రాడ్యుయేట్, ఫ్రెషర్ పోస్టులకు కూడా రెండేళ్ల అనుభవం కోరుతున్నారని, పలు రౌండ్ల ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం మానసిక ఒత్తిడిని పెంచుతోందని కామెంట్ పెట్టాడు. 2025లో ఎడ్యుకేషన్ పూర్తి చేసిన మరో యువకుడు కూడా ఇప్పటికీ మంచి ఉద్యోగం దొరకలేదని, మార్కెట్ పరిస్థితి నిజంగానే బాగోలేదంటూ వాపోయాడు.
ALSO READ : ఏ తప్పులు చేస్తే అద్దెకు ఉన్నోళ్లను ఓనర్స్ ఖాళీ చేయించొచ్చు..
అయితే అందరి అభిప్రాయం ఒకేలా లేదు. కొందరు స్టార్టప్‌ల నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ జీతభత్యాలు, రెండు సంవత్సరాల బాండ్ వంటి నిబంధనల కారణంగా చాలామంది వెనక్కి తగ్గుతున్నారని చెప్పారు. ఒక యూజర్ AI ట్రైనీ పోస్టుకు నెలకు కేవలం రూ.16వేల జీతంతో పాటు రెండేళ్ల బాండ్ అడిగారని వెల్లడించాడు. ఈ పరిస్థితులు కంపెనీలు నియామకాల్లో ఖర్చు తగ్గింపు, నైపుణ్యాలకు ప్రాధాన్యం, తక్కువ వేతనాలతో రిక్రూట్మెంట్స్ వంటి కొత్త హైరింగ్ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయని సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఫ్రెషర్లు కేవలం డిగ్రీపై ఆధారపడకుండా AI, క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ వంటి డిమాండ్ ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకుంటే అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ బెంగళూరులోని జాబ్ మార్కెట్ ఇప్పుడు ఫ్రెషర్లకు పెద్ద పరీక్షగా మారిందనే చెప్పుకోవాలి.
