లీటరుకు 20% ఇథనాల్ కలిపినా పెట్రోల్ రేటు మాత్రం ఎందుకు తగ్గించట్లే..? కేంద్రం క్లారిటీ

లీటరుకు 20% ఇథనాల్ కలిపినా పెట్రోల్ రేటు మాత్రం ఎందుకు తగ్గించట్లే..? కేంద్రం క్లారిటీ

దేశవ్యాప్తంగా ఇప్పుడు E20 పెట్రోల్ అందుబాటులోకి వచ్చినా చాలా మంది వాహనదారులను వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. లీటర్ పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ ఉంటే ధర ప్యూర్ పెట్రోల్ కంటే ఎందుకు తగ్గడం లేదు? అన్నదే. ఈ సందేహానికి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజాగా స్పష్టమైన వివరణ ఇచ్చింది. E20 పెట్రోల్ ఉద్దేశం ధర తగ్గించడం కాదని, విదేశీ ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని వెల్లడించింది.

ప్రస్తుతం ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిదారుల నుంచి ఇథనాల్‌ను స్థిరమైన ధరలకు కొంటోంది. మొక్కజొన్నతో తయారైన ఇథనాల్ లీటర్‌కు సుమారు రూ.71.86 ధర చెల్లిస్తోంది. దీనికి జీఎస్టీ, రవాణా, స్టోరేజ్, ఇతర నిర్వహణ ఖర్చులు అదనంగా ఉంటాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉండటంతో.. ఈ పరిస్థితుల్లో E20 పెట్రోల్ తయారీ వ్యయం సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువగానే ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఇథనాల్ ధరలు రోజువారీగా మారవు. రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని స్థిరంగా నిర్ణయిస్తోందట. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ పరిస్థితులను బట్టి మారుతుంటాయి. అందువల్ల ఇథనాల్ కలిపినంత మాత్రాన పెట్రోల్ తయారీ ఖర్చు తగ్గిపోదని అధికారులు అంటున్నారు. మరి అలాంటప్పుడు దేశీయంగా ఇథనాల్ అధిక రేటుకు తయారు చేసి దానిని పెట్రోల్ లో కలపటం వల్ల యూజ్ ఏంటనే ప్రశ్న వాహనదారుల నుంచి మేధావుల నుంచి వినిపిస్తోంది.

ALSO READ : పాత కారు ఓనర్లకు గుడ్‌‌న్యూస్: E20 కోసం ఉచితంగా స్పేర్స్ పార్ట్స్ మార్చుకోవచ్చు..!

అయితే భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 120 నుంచి 130 డాలర్లకు పెరిగితే పరిస్థితి మారే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. ఆ సమయంలో ఇథనాల్‌తో తయారయ్యే E20 పెట్రోల్ సాధారణ పెట్రోల్ కంటే తక్కువ ఖర్చుతో తయారయ్యే అవకాశం ఉంటుందని మోడీ సర్కార్ అంటోంది. ప్రస్తుతం మాత్రం ఈ కార్యక్రమం టార్గెట్ పెట్రోల్ రేట్లను తగ్గించడం కాదు.. ఫారెక్స్ రిజర్వ్ ఆదా చేయడం, రైతులకు ఆదాయం పెంచడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించడం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో అంతర్జాతీయంగా క్రూడ్ రేట్లు తగ్గినా దేశీయంగా వాహనదారులకు ఆ ప్రయోజనాలు దక్కే ఛాన్స్ అస్సలు లేదని తేలిపోయింది.