- ఇంకుడు గుంతలు, కుంటలు, చెక్‌డ్యామ్‌లతో ఫలితం
- 551 గ్రామ పంచాయతీల పరిధిలో 3.41 లక్షల నీటి సంరక్షణ నిర్మాణాలు
- ‘మై విలేజ్, మై వాటర్ 2.0’ పేరిట ప్రచారం.. లక్షలాది మంది శ్రమదానం
- ఆదర్శంగా చత్తీస్‌గఢ్ గ్రామాల్లో నీటి సంరక్షణ ఉద్యమం
- ఇంకుడు గుంతలు, కందకాలు, చెక్‌డ్యామ్‌లు, కుంటల నిర్మాణంతో అద్భుత ఫలితాలు
రాయ్‌పూర్: ‘బావి ఎండిపోయే వరకు నీటి విలువ తెలియదు’ అనే సామెత ప్రాధాన్యం ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లా ప్రజలకు బాగా తెలిసొచ్చింది. అందుకే, దీర్ఘకాలికంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్న ఆ జిల్లాలోని గ్రామాల ప్రజలంతా.. ఈ సమస్య నుంచి బయటపడటం కోసం ఒక్కటిగా ముందుకు కదిలారు. నీటి కరువు సమస్యను నేరుగా ఎదుర్కొనేందుకు ఒక అద్భుతమైన ప్రజా నీటి సంరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ వానాకాలంలో కేవలం 15 రోజుల్లోనే లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పొలాల్లో, అడవుల్లో వర్షపు నీటిని నిల్వ చేసే నిర్మాణాలను నిర్మించారు.
ఇళ్ల వద్ద వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకున్నారు. వారి శ్రమకు తక్షణ ఫలితాలు దక్కాయి. తొలకరి వానలకే పెద్ద ఎత్తున నీటిని ఒడిసిపట్టారు. సాధారణంగా డ్రైనేజీలు, నదుల గుండా వృథాగా పోయే దాదాపు 31 కోట్ల లీటర్ల నీటిని ఈ జిల్లా ప్రజలు నిల్వ చేయగలిగారు. ఆయా గ్రామాల ప్రజలంతా కలిసికట్టుగా శ్రమదానం చేయడం ద్వారా దీర్ఘకాలిక నీటి సంక్షోభాన్ని పరిష్కరించుకోవడమే కాకుండా, ప్రజా భాగస్వామ్యానికి ఒక చక్కని నమూనాను సృష్టించారు.
మహాసముంద్ జిల్లాలో ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ విస్తారంగా వరి సాగు చేయడం వల్ల భూగర్భ జల వనరులపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. దీనివల్ల ఏళ్ల తరబడి నీటి మట్టాలు క్రమంగా పడిపోయాయి. ఫలితంగా చాలా ప్రాంతాలు ప్రతి వేసవిలో తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రజలకు నీటి లభ్యత అనేది ఏటా ఒక సవాలుగా మారింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జిల్లా అధికార యంత్రాంగం, స్థానిక ప్రజలు ఒక ఉమ్మడి లక్ష్యంతో ముందుకు వచ్చారు. నీటి సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని నిర్ణయించారు.
‘మై విలేజ్, మై వాటర్ 2.0’ పేరిట ఉద్యమం
జిల్లా నీటి సంరక్షణ ప్రయత్నాలకు ‘మై విలేజ్, మై వాటర్ 2.0’ పేరిట చేపట్టిన ప్రచారం ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చొరవ కింద, యంత్రాంగం 551 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,140కి పైగా గ్రామాలలో పెద్ద ఎత్తున భూగర్భ జలాల రీఛార్జ్, వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. స్థానిక నీటి వనరులను పునరుద్ధరించడానికి, సంరక్షించడానికి లక్షలాది మంది గ్రామస్తులు ఈ ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
గ్రామాల్లోనే వర్షపు నీటిని నిలిపి ఉంచడం, భూగర్భ జలాల మట్టాలను పెంచడం ద్వారా దీర్ఘకాలిక నీటి భద్రతను పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. గ్రామస్తులు తమ శ్రమదానం ద్వారా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని వర్షపు నీటిని సంరక్షించారు.
తొలకరి వానలకే.. తక్షణ ఫలితాలు
ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయంతో కేవలం 15 రోజుల్లోనే ఈ జిల్లాలో వర్షపు నీటి సంరక్షణ గుంతలు, ఇంకుడు గుంతలు, కందకాలు, చెక్ డ్యామ్‌లు, చెరువులు, బావులతో సహా 3,41,000 కి పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను నిర్మించారు. దీంతో ‘మై విలేజ్, మై వాటర్ 2.0’ ఉద్యమ ప్రభావం ఈ వానాకాలం సీజన్ మొదటి వర్షంతోనే స్పష్టంగా కనిపించింది.
మే 14 నుంచి మే 30 మధ్య కురిసిన వర్షాలకు, నదులు, కాలువల్లోకి వృథాగా పోయే దాదాపు 310 మిలియన్ లీటర్ల (31 కోట్ల లీటర్ల) నీటిని జిల్లా ఒడిసిపట్టింది. ఇది భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడానికి, దీర్ఘకాలిక నీటి భద్రతను బలోపేతం చేయడానికి సహాయపడింది.
ప్రజా భాగస్వామ్యంతో అద్భుత విజయం
వ్యవసాయ, అటవీ, జిల్లా పంచాయతీ, జనపద్ పంచాయతీ వంటి శాఖల మధ్య బలమైన ప్రజా భాగస్వామ్యం, సమన్వయం వల్లే ‘మై విలేజ్, మై వాటర్ 2.0’ ప్రచారం విజయవంతమైందని మహాసముంద్ కలెక్టర్ వినయ్ కుమార్ లంగేహ్ చెప్పారు. ప్రధానమంత్రి ‘జల సంరక్షణ -జన భాగస్వామ్యం’ విజన్ స్ఫూర్తితో సాగిన ఈ కార్యక్రమం.. ప్రజలు, యంత్రాంగం కలిసి పనిచేస్తే ఎంతటి ప్రతిష్టాత్మకమైన నీటి సంరక్షణ లక్ష్యాలనైనా సాధించవచ్చని నిరూపించిందని అభిప్రాయపడ్డారు.
నీటిని పొదుపు చేసే ఈ మిషన్‌లో ఆయా గ్రామాల్లోని దాదాపు ప్రతి ఇల్లూ భాగస్వామ్యం అయిందన్నారు. అరంద్ గ్రామ పంచాయతీ నివాసి శంకర్ లాల్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్రామంలోని నీటి కొరతపై గ్రామసభ సమావేశంలో చర్చించి, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించాలని నిర్ణయించారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా ఈ ప్రయత్నాన్ని పూర్తి చేశారు.
