ప్రతి రైతుకూ భూధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు: మంత్రి పొంగులేటి

ప్రతి రైతుకూ భూధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులు: మంత్రి పొంగులేటి

భూభారతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమినీ సర్వే చేసి, సాగులో ఉన్న ప్రతి రైతుకు మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కూడిన భూధార్ కార్డును అందజేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో భూభారతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 

పైలట్ ప్రాజెక్ట్ కింద మధిర నియోజకవర్గంలోని ములుగుమాడు రెవెన్యూ గ్రామంలో సర్వే పూర్తి చేసి, సుమారు 476 మంది రైతులకు మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో కూడిన భూధార్ కార్డులను అందిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు మొదటి రెండేళ్లలోనే రికార్డు స్థాయిలో 71 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలోనే మరో 17 నుంచి 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాలేదని, చేతల్లో చూపిస్తోందని పొంగులేటి అన్నారు. 

గత పాలకులు తాము చేసిన తప్పులను, అబద్ధాలను ఈ ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రతి పిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ అవినీతి కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఎన్నికల ముందే చెప్పాం. ఇవాళ అదే నిజమైంది’ అని విమర్శించారు. అబద్ధాల ప్రచారం మానుకోకపోతే రాబోయే రోజుల్లోనూ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి రెండో విడత పూర్తి చేసిందని, త్వరలో మిగిలిన విడతలను కూడా శరవేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని  హామీ ఇచ్చారు.