హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం..బైక్లు, కార్లు, బస్లు పోయేందుకు వేర్వేరుగా మార్కింగ్

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం..బైక్లు, కార్లు, బస్లు పోయేందుకు వేర్వేరుగా  మార్కింగ్

 

  • హుమ్టా కొత్త ప్లాన్​..   కారిడార్  ఇంప్రూవ్​మెంట్​ ప్లాన్​
  • మొదటి దశలో  మూడు రూట్లలో అమలు 
  •   ఫుట్​పాత్​ ఆక్రమణల  తొలగింపు
హైదరాబాద్​సిటీ, వెలుగు :హెచ్ఎండీఏ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ‘హుమ్టా’ కొత్త ప్లాన్​అమలు చేయబోతోంది. సిటీలో ఎంపిక చేసిన ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్​నియంత్రణతో పాటు పాదచారుల జోన్​, జంక్షన్ల అభివృద్ధి చేపట్టనున్నది. గ్రేటర్​లో ఇప్పటికే 18 లక్షలకు పైనే వాహనాలున్నాయి. 

రాను రాను ఈ సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ట్రాఫిక్​సమస్య కూడా రెట్టింపవుతున్నది. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్​ సమస్యల కారణంగా గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. చాలా చోట్ల ఫుట్​పాత్​లు కూడా ఆక్రమిస్తుండడంతో పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాల భారిన పడుతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికి హుమ్టా ‘కారిడార్​డెవలప్​మెంట్​ప్లాన్’​తో ముందుకు వచ్చింది.  

ఏంటీ ప్లాన్​​? 

సిటీలో ముందు ఎక్కువ ట్రాఫిక్​ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ పలు అభివృద్ధి పనులు చేపడతారు. మొదటి దశలో మియాపూర్ టు గండిమైసమ్మ, ఒవైసీ హాస్పిటల్ టు తార్నాక, ప్యారడైజ్ టు అసెంబ్లీ  ప్రాంతాల్లో ఈ ప్లాన్​అమలు చేస్తారు. 

ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగించడంతో పాటు మెయిన్​రోడ్లపై నాన్ మోటో రైజ్డ్ ట్రాన్స్​పోర్ట్​ లైన్లు ఏర్పాటు చేస్తారు. అంటే ఈ వేలో మోటార్​వాహనాలను అస్సలే అనుమతించారు. కేవలం నడిచి వెళ్లేవారు, సైకిళ్లపై వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తారు. ఆయా ప్రాంతాల్లో జంక్షన్లను రీ డెవలప్ మెంట్​, యూ టర్న్స్ ఏర్పాటు వంటి పనుల ద్వారా ట్రాఫిక్ సమస్యలను అధిగమించనున్నారు.

 అలాగే, యూనిఫామ్​సెంట్రల్​మీడియన్​ డెవలప్​మెంట్​ పనులు కూడా చేస్తారు.  స్పేస్​వాకర్స్​పేరుతో రోడ్లపై బైక్​లు, కార్లు, బస్​లకు వేర్వేరుగా మార్కింగ్​ వేస్తారు. ఈ మార్కింగ్​లోనే సదరు వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది.