భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ ఉక్కిరిబిక్కిరి.. 118 రోడ్లు బంద్.. ఉప్పొంగుతున్న నదులు

భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ ఉక్కిరిబిక్కిరి.. 118 రోడ్లు బంద్.. ఉప్పొంగుతున్న నదులు
  • ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్, చంపావత్ జిల్లాలకు రెడ్ అలర్ట్
  • హిమాచల్​లోనూ వర్ష బీభత్సం

డెహ్రాడూన్/సిమ్లా: రుతుపవనాల కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కొండచరియలు విరిగిపడటం, రోడ్లపైకి భారీగా రాళ్లు, మట్టి కొట్టుకురావడంతో దాదాపు 118 రోడ్లు మూతపడ్డాయి. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లే మార్గాలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. నలుపాని వద్ద కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. 

అలాగే, శ్యానాచట్టి సమీపంలో యమునోత్రి జాతీయ రహదారి దాదాపు 100 మీటర్ల మేర దెబ్బతినడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు కీలకమైన హెచ్చరికలు చేసింది. ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్, చంపావత్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. 

ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలను పూర్తిగా వాయిదా వేసుకోవాలని కోరింది. భారీ వర్షాలకు భాగీరథి, అలకనంద సహా ప్రధాన నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.

హిమాచల్​లో ఇదీ పరిస్థితి..

హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లోనూ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి, జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌‌‌‌వాడీ కేంద్రాలను అధికారులు మూసివేశారు. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. హఠాత్తుగా వచ్చే వరదలు పట్ల వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.