- 3 నెలల్లోగా వసూలు చేయాలని యూపీపీసీబీకి ఆదేశం
వారణాసి: బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ షాక్ ఇచ్చింది. క్యాంపస్‌లో 33 చెట్లను అక్రమంగా నరికివేసినందుకుగానూ యూనివర్సిటీ నుంచి రూ. 2.65 కోట్లకు పైగా పర్యావరణ పరిహారాన్ని వసూలు చేయాలని ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (యూపీపీసీబీ)ని ఆదేశించింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లోగా పూర్తిచేయాలని స్పష్టం చేసింది.
ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, నిపుణుల కమిటీ సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్‌లతో కూడిన బెంచ్ ఈమేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చెట్ల నరికివేతకు సంబంధించి యూపీపీసీబీ ఇప్పటికే రూ. 2,65,06,877 పర్యావరణ నష్టపరిహారాన్ని లెక్కించిందని, రికవరీ చర్యలు కొనసాగుతున్నాయని ట్రిబ్యునల్ పేర్కొంది.
అసలేం జరిగిందంటే..?
బీహెచ్‌యూకు చెందిన 1,300 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో చెట్లను అక్రమంగా నరుకుతున్నారంటూ న్యాయవాది సౌరభ్ తివారీ గతంలో ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై విచారణకు ఎన్జీటీ ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జరిపిన తనిఖీల్లో.. 7 విలువైన చందనం చెట్లతోపాటు వివిధ రకాలకు చెందిన మరో 26 చెట్లను అక్రమంగా నరికివేసినట్లు తేలింది.
దీని ఆధారంగా, నిరుడు ఆగస్టులోనే నష్టపరిహారాన్ని అంచనా వేసి, 3 నెలల్లోగా వసూలు చేయాలని యూపీపీసీబీని ఎన్జీటీ ఆదేశించింది. అయితే, అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల రికవరీ ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు తెలిపారు.
