- బాయిబాట కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత
మణుగూరు/అశ్వారావుపేట, వెలుగు : సింగరేణికి ప్రభుత్వం బకాయి పడిన రూ. 50 వేల కోట్లను వెంటనే చెల్లించాలని, మూడు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రెండు నెలలకో సారి మెడికల్ బోర్డు నిర్వహించాలన్న డిమాండ్ తో ఈ నెల 20న నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.
బాయి బాట కార్యక్రమంలో భాగంగా మణుగూరు మైన్ లో శుక్రవారం పర్యటించారు. పీకే ఓసీ 2 సందర్శనకు వచ్చిన కవితను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సింగరేణిలో పోలీసులకు ఏం పని అంటూ కవిత వారితో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత సింగరేణి అధికారుల అనుమతితో గనిలో పర్యటించి కార్మికులతో మాట్లాడారు.
తాడిచర్ల 2ను సింగరేణికి అప్పగించామని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మణుగూరు ఓసీ 2 డిప్ సైడ్ గనితో పాటు పెండింగ్లో ఉన్న 17 బొగ్గు బ్లాకులను టెండర్ లేకుండా సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
లూటీ చేసినోళ్లకు మాఫీ.. ఆదివాసీలకు మొండిచేయి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కొత్త గంగారంలో నాయకపోడు గిరిజనులతో కల్వకుంట్ల కవిత సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకులు లూటీ చేసిన వాళ్ల అప్పులు మాఫీ చేసిన బీజేపీ సర్కార్.. గిరిజనులు బైక్ కొనుక్కుందామన్నా లోన్లు ఇవ్వడం లేదని విమర్శించారు. 1950 నాటి రికార్డుల్లో నాయకపోడుల పేరు లేకపోవడం దారుణమని, గిరిజనుల హక్కుల కోసం ఢిల్లీ దాకా పోరాడుతామని చెప్పారు.
విదేశాల్లో ఇస్తున్నట్టు ఆదివాసీలకు రూ.2 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు బ్యాంకు లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయాల కోసమే కాకుండా.. ప్రజల కోసం వచ్చానని, అన్న రాజ్యం కాదు... అక్క రాజ్యం అంటే ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతుకు ప్రత్యేక కుర్చీ వేయిస్తామన్నారు. అంతకుముందు వనదేవతలకు పూజలు చేసిన అనంతరం ఆదివాసీలతో సహపంక్తి భోజనం చేశారు.
