- బీజేపీ తలుపులు తెరిచినా, మూసినా ఏం లాభం లేదు
- హరీశ్‌రావు కాంగ్రెస్‌లోకి వస్తానంటే పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం
- బీఆర్ఎస్ ఖాతాలో రూ.1,400 కోట్లు ఉన్నాయంటే అనుమానించాల్సిందే
హైదరాబాద్, వెలుగు: దేశ ప్రజలకు బీజేపీ ఇచ్చిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల భర్తీ హామీని అమలు చేసిన తర్వాతే ఆ పార్టీ నేతలు తెలంగాణకు రావాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. ఆ హామీ నెరవేర్చిన తర్వాత జేపీ నడ్డా వచ్చినా, నబీన్ వచ్చినా, మరెవరు వచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
దేశంలో 12 ఏండ్ల బీజేపీ పాలనను ప్రజలు చూశారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చాలా బాగుందని, ప్రజలు తమను పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు వేరే పార్టీలు తలుపులు తెరిచి ఉంచినా, మూసి ఉంచినా వచ్చే నష్టమేమీ లేదని మహేశ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
హరీశ్‌కు 3 నెలల టైం ఎందుకివ్వాలి?
గతంలో హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిందని, దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారని మహేశ్ గౌడ్ నిలదీశారు. పదేళ్లు మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏమీ చేయని హరీశ్‌రావుకు.. ఇప్పుడు మళ్లీ మూడు నెలల సమయం ఎందుకివ్వాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో నీళ్ల దోపిడీ జరిగినప్పుడు ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా ఉన్నారని, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పిదాలను ఆయన అప్పట్లో ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు.
ఈటల రాజేందర్ తీరు చూస్తుంటే బీఆర్ఎస్‌కు మద్దతు పలుకుతున్నట్లు కనిపిస్తోందన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి హరీశ్‌రావుకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఒకవేళ హరీశ్‌రావు కాంగ్రెస్‌లోకి వస్తానంటే పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ ఖాతాలో రూ. 1,400 కోట్లు ఉన్నాయంటే, అన్ని పైసలు ఎలా వచ్చాయో అనుమానించాల్సిందేనని, ఈ విషయంలో కవిత చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందన్నారు.
15 తర్వాతే కార్పొరేషన్ పదవుల భర్తీపై క్లారిటీ
ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో చర్చించిన తర్వాతనే రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీపై తుది నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ వెల్లడించారు. ఒక పెద్ద పార్టీలో సమస్యలు, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు రావడం సహజమేనన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారని, దీనివల్ల కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలు ఏర్పడ్డాయని అంగీకరించారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి - మంత్రి కొండా సురేఖ వర్గాల మధ్య, అలాగే తుంగతుర్తిలో ఎమ్మెల్యే మందుల సామ్యేల్ అంశంపై తలెత్తిన వివాదాల పరిష్కారానికి ఇద్దరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇచ్చిన తర్వాత పార్టీపరంగా తగిన నిర్ణయం తీసుకుంటామని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
