మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా దర్జాగా బయట తిరిగిన నిందితుడు !

మనిషి కాదు మానవ మృగం.. పోక్సో కేసు నమోదైన తర్వాత కూడా దర్జాగా బయట తిరిగిన నిందితుడు !

దైవాలగూడ: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురిని హత్య చేసిన పోక్సో కేసు నిందితుడి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి పక్కన ఉండే అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె కాలేజ్కు వెళ్లే దారిలో ఆమెను ఇబ్బందిపెట్టేవాడని గ్రామస్తులు తెలిపారు. ఆమె వెళ్లే బస్సుకు అడ్డం తగిలి బస్సు దిగాలని.. కారులో పోదామని ఆమెను ఇబ్బందిపెట్టేవాడని గ్రామస్తులు చెప్పారు.

ఈ విషయం తమకు తెలియడంతో.. అతనిని హెచ్చరించి.. బాధిత బాలికకు రక్షణగా గ్రామస్తులు కాలేజ్కు ఆమె వెళ్లి  వచ్చే వరకూ ఉండేవారని తెలిపారు. ఒకరోజు.. బాలికను బలవంతంగా తీసుకెళుతుంటే.. అడ్డు తగిలిన గ్రామస్తురాలికి నిందితుడు వార్నింగ్ కూడా ఇచ్చాడని చెప్పారు.

‘‘నీ మొగుడిని నేను సంవత్సరం కిందనే చంపినా.. ఎవడేమన్నా పీకిండా.. పోలీసులకు పైసలు పారేస్తే నన్ను ఎవరూ ఏం చేయరు’’ అని బాలికకు రక్షణగా ఉన్న గ్రామస్తురాలితో అనడంతో ఆమె షాకైంది. ఆమె భర్తను కూడా నిందితుడే చంపినట్లు స్వయంగా నిందితుడే చెప్పడంతో బాధిత బాలికపై ఘోరానికి పాల్పడక ముందే నిందితుడికి నేర చరిత్ర ఉందని స్పష్టమైంది. పోక్సో కేసు ఫైల్ అయిన తర్వాత కూడా నిందితుడు బెయిల్పై దర్జాగా బయటతిరిగాడని, బాధితురాలికి ప్రమాదం ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్పారు. గ్రామ సర్పంచ్ కూడా పోలీసులకు తొత్తుగా పనిచేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు.

రంగారెడ్డి జిల్లాలో దారుణం

  • షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురి హత్య
  • ఆరుగురిని కత్తితో పొడిచి చంపిన రాజ్‌కుమార్‌
  • పోక్సో కేసు పెట్టారన్న కక్షతో హత్య చేసిన నిందితుడు
  • భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురి హత్య
  • మే 16న కేసు పెట్టిన బాధితురాలి తల్లి
  • బెయిల్‌పై వచ్చి నిందితుడు రాజ్‌కుమార్‌ ఘాతుకం
  • బాధిత బాలిక, తల్లి, నానమ్మను హత్యచేసిన నిందితుడు
  • హత్యల అనంతరం తల్లిదండ్రులకు రాజ్‌కుమార్‌ ఫోన్‌
  • ఆరుగురిని హత్యచేసినట్టు ఫోన్‌లో చెప్పిన నిందితుడు
  • తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన రాజ్‌కుమార్
  • రాజ్‌కుమార్‌ కోసం గాలిస్తున్న పోలీసులు
  • ఘటనాస్థలికి సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్
  • ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు