న్యూఢిల్లీ: అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) తమ మానిటరీ పాలసీని సమీక్షించేందుకు ఐదు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. ఇందులో భారత సంతతికి చెందిన ఆర్థికవేత్తలు రఘురామ్ రాజన్, రాజ్ చెట్టి, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఆశా శర్మ కీలక ప్యానెల్స్‌కు నాయకత్వం వహించనున్నారు. ఫెడ్ చైర్మన్ కెవిన్ వార్ష్ ఈ ఏడాది చివరి నాటికి ఈ సమీక్షను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఫెడ్‌కి చెందిన 6.7 ట్రిలియన్ డాలర్ల బ్యాలెన్స్ షీట్ విధానాన్ని సమీక్షిస్తారు. అసెట్ హోల్డింగ్స్, మానిటరీ పాలసీ అమలులో వాటి పాత్ర, ప్రయోజనాలపై ఈ ప్యానెల్ సిఫార్సులు చేస్తుంది.
హార్వర్డ్ ఆర్థికవేత్త రాజ్ చెట్టి నేతృత్వంలోని బృందం.. ఫెడ్ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమయ్యే ఆర్థిక సంకేతాలు, డేటా నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది. మైక్రోసాఫ్ట్ ఈవీపీ ఆశా శర్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల వల్ల ఉద్యోగాల కల్పన, ఉత్పాదకతపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తారు.
