న్యూఢిల్లీ: ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను అమర్చడాన్ని తీసుకొచ్చిన ప్రోగ్రామ్ పీఎం సూర్యఘర్ పథకానికి మద్దతిచ్చేందుకు, ఇంధన రంగంలో దాదాపు 17 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంక్ 890 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8,500 కోట్లు) అప్పు ఇవ్వనుంది.
ఈ మొత్తం సాయంలో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐబీఆర్‌డీ) నుంచి 820 మిలియన్ డాలర్ల రుణం, క్లీన్ టెక్నాలజీ ఫండ్ నుంచి 60 మిలియన్ డాలర్ల రాయితీతో కూడిన రుణం, ఐబీఆర్‌డీ లివబుల్ ప్లానెట్ ఫండ్ నుంచి 10 మిలియన్ డాలర్ల గ్రాంట్ ఉన్నాయి.
దీంతోపాటు, ప్రైవేట్ కమర్షియల్ రుణాల రూపంలో మరో 4.2 బిలియన్ డాలర్లను ప్రపంచ బ్యాంక్ అందించనుంది.
పీఎం సూర్య ఘర్ యోజనకు బూస్ట్
2035 నాటికి దేశంలో 60శాతం విద్యుత్ అవసరాలను పర్యావరణ అనుకూల ఇంధనాల ద్వారా పొందాలని, 2070 నాటికి 'నెట్ జీరో' సాధించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కోటి గ్రామీణ, పట్టణ గృహాలకు "పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన" ద్వారా సోలార్ కరెంట్‌ను అందివ్వాలని చూస్తోంది.
ఈ ప్రోగ్రామ్ విజయవంతం కావడానికి వరల్డ్ బ్యాంక్ నిధులు సాయపడతాయి. సోలార్ ప్యానెళ్ల తయారీ, ఇన్‌స్టాలేషన్, సర్వీస్ రంగాలలో 17 లక్షల మందికి పని దొరుకుతుంది. సామాన్య ప్రజలకు ష్యూరిటీ లేకుండా ఫైనాన్సింగ్ లభిస్తుంది.
గత పదేళ్లలో భారతదేశ సోలార్ సామర్థ్యం 500 మెగావాట్ల నుంచి 27 గిగావాట్లకు చేరింది. ఇందుకు ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన 2 బిలియన్ డాలర్లు సాయపడ్డాయి.
