హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్) నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఫిర్యాదుపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు, వాస్తవ పరిస్థితులు, యూనివర్సిటీ స్థాయిలో తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని కేయూ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
యూజీసీ నిబంధనల ప్రకారం ఫుల్ టైమ్ రీసెర్చర్స్ కు మాత్రమే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ వర్తిస్తుంది. ఈ మేరకు ఫెలోషిప్ కాలంలో ఇతర ఉద్యోగం చేయకూడదనే నిబంధన సైతం ఉంది. కానీ కేయూ తెలుగు డిపార్ట్ మెంట్ కు చెందిన డాక్టర్ మంతని శంకరయ్య 2011 ఏప్రిల్ నుంచి 2013 జూన్ వరకు కేయూలో పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేశాడు.
ఓ వైపు జీతం తీసుకుంటూనే మరో వైపు యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ కింద సుమారు రూ.6.89 లక్షలు కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై ఇటీవల కేయూ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు అందింది. ఐదుగురు సభ్యుల కమిటీతో విచారణ జరుపగా... ఫెలోషిప్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. దీంతో శంకరయ్యకు రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కానీ యూజీసీ ఫెలోషిప్ కింద పొందిన డబ్బులను తిరిగి రికవరీ చేయకపోవడం, క్రమశిక్షణా చర్యలు చేపట్టకపోవడంపై యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ కు ఫిర్యాదులు అందాయి.
అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో యూజీసీకి ఫిర్యాదు అందింది. దీంతో స్పందించిన యూజీసీ.. శంకరయ్యకు సంబంధించిన యూజీసీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అంశాన్ని పరిశీలించి, సంబంధిత రికార్డులు, తీసుకున్న చర్యలతో కూడిన పూర్తి నివేదికను పంపాలని ఈ మెయిల్ ఆదేశాలు జారీ చేసింది. యూజీసీ తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వాస్తవ పరిస్థితులపై సమగ్ర నివేదిక సమర్పించాలని లేఖలో స్పష్టం చేసింది. కాగా కాకతీయ యూనివర్సిటీ నుంచి పంపే నివేదిక ఆధారంగా పీడీఎఫ్ నిధుల దుర్వినియోగంపై యూజీసీ తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
