ఓటర్లకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి...రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి

ఓటర్లకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి...రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొనసాగుతున్న సర్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం (పీఆర్‌‌‌‌‌‌‌‌సీ) లేదా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు సీఎస్‌‌‌‌ సంజయ్ జాజును కలిసి వినతిపత్రం అందజేశారు. పేదలు, బలహీన వర్గాలకు చెందిన అర్హులైన ఓటర్లు నివాస ధ్రువీకరణలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

కర్నాటకలో అమలులో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో కూడా పీఆర్‌‌‌‌‌‌‌‌సీలు జారీ చేయాలని సూచించిన ఒవైసీ, సమగ్ర కుటుంబ సర్వే, సామాజిక- ఆర్థిక కుల గణన, భూ రికార్డులు, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, మున్సిపల్ పన్ను రికార్డులు, విద్యా శాఖ వివరాలు వంటి ప్రభుత్వ డేటాబేస్‌‌‌‌ల ఆధారంగా అర్హులైన వారికి ధ్రువపత్రాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదన అమలైతే పేదలు, మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు ఇతర అర్హులైన ఓటర్లు సర్ ప్రక్రియలో సులభంగా తమ నివాసాన్ని నిరూపించుకొని ఓటరు జాబితాలో పేరు కొనసాగించుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.